Mar 14,2023 17:49

రైతులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం

ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
ప్రజాశక్తి కొత్తపల్లి

      వ్యవసాయ పంటల సాగులో ప్రకృతి వ్యవసాయంతో రైతులు అధిక దిగుబడులు  పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇంచార్జ్ సయ్యద్ భాష తెలిపారు. మంగళవారం మండలంలోని  శివపురం గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు తలారి లింగన్న మూడు ఎకరాల మునగ పంటను, దీంతోపాటు అంతర పంటలైన చిక్కుడు, పంటలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు వేస్తున్న పంటలలో వ్యవసాయ పద్ధతిలో జీవామృతం, మేమాస్త్రం( వేప కషాయం) తయారీ విధానం వాడుకోవాలని వివరించారు. రైతులకు వ్యవసాయ పొలాల్లో  వాటిని తయారు చేసుకోవచ్చు అన్నారు. జీవామృతంను వాడడం వల్ల భూమిలోని సూక్ష్మ జీవులకు ఆహారం, వాన పాముల ఎదుగుదలకు అవసరమైన ఆహారం లభిస్తుం దన్నారు. వీటి వాడకం వల్ల భూమి సారవంతం అవుతుందని తెలిపారు. రసాయనిక ఎరువులైన యూరియా, డి ఏ పి వాడకం తగ్గించవచ్చునన్నారు. వేప కషాయం వల్ల పంటను ఆశించే తెగుళ్లను, దోమపోటును, పురుగును నివారించవచ్చునన్నారు. వీటితో పాటుగా అధిక దిగుబడిని రైతులు సాధించవచ్చునన్నారు. కార్యక్రమంలో ఆర్ బి కే వి ఏ ఏ మౌనిక, ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది వెంకటేష్, సుమలత, రైతులు పాల్గొన్నారు.