ప్రజాశక్తి-కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోట గ్రామంలోని రైతులకు బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం తయారీపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ప్రకృతి వ్యవసాయ రిసోర్సు పర్సన్ గుణావతి మాట్లాడుతూ, వరి పంటలో అధిక నష్టాన్ని కలిగించే పెద్ద పురుగు, గొంగళి పురుగులను నాశనం చేసి పంట ఎదుగుదలకు, దిగుబడికి బ్రహ్మస్త్రం ద్రావణం ఎంతగానో ఉప యోగపడుతోందన్నారు. వేపాకు, ఉమ్మత్తి, బొప్పాయి, శీతాఫలం, ఆముదం వంటి ఐదు రాకాల ఆకులను మూడు కేజీల చొప్పున ముద్దగా చేసి నాలుగు పొంగులు వచ్చే వరకూ మరగబెట్టి 48 గంటలు చల్లార్చిన తర్వాత 15 లీటర్ల గోమూత్రంలో కలిపి ఆ కషాయాన్ని దాచుకోవాలన్నారు. 200 లీటర్ల నీటిలో 2.5 లీటర్ల కషాయం కలిపి పిచికారీ చేస్తే పెద్ద పురుగు, గొంగళిపురుగులు నాశనమవుతాయన్నారు.ఒక డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకుని దానిలో 10లీటర్ల గోమూత్రం, రెండు కేజీల ఆవు పేడ, ముద్దగా చేసిన 10 కేజీల వేపాకు, కలిపి ఉదయం సాయంత్రం సవ్యదిశలో కలిపితే 48 గంటల్లో నీమాస్త్రం తయారవు తుందన్నారు. ఈ కషాయం రసం పీల్చే పురుగు గుడ్లను, చిన్న చిన్న గొంగులి పురుగులను నాశనం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది. కోట నిర్మల, దొరబాబు, లక్ష్మి, సన్యాశినాయుడు, లావణ్య. స్వాతి రైతులు గుమ్ముడు గోవింద, అప్పారావు పాల్గొన్నారు.










