ప్రజాశక్తి -గరుగుబిల్లి : ప్రకృతి వ్యవసాయ ప్రతి పల్లెకు విస్తరించేలా నిర్వాహకులు కృషి చేయాలని విశ్రాంత ఐఎఎస్ అదికారి టి.విజరుకుమార్ అన్నారు. మండలంలోని తోటపల్లి జట్టు ట్రస్ట్ నూతన ప్రాంగణంలో 25 వసంతాల జట్టు ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు జట్టు వ్యవస్థాపకులు డాక్టర్ డి.పారి నాయుడు అధ్యక్షతన శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టి.విజయకుమార్ ముందుగా 1కె.మయంతి (ఐఎఎస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్త్రీ, శిశు సంక్షేమం) సహకారంతో నిర్మించిన కార్యాలయ భవన సముదాయం, పర్యావరణహిత జట్టు గ్రంథాలయం, అన్నపూర్ణేశ్వరి సమావేశ మందిరం, డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్మించిన గోడౌన్, సహజ ఎరువుల ఉత్పత్తి కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, రైతులు ఆర్థిక అభివృద్ధి చెందడానికి, మహిళా సంఘ సభ్యులను చైతన్యపర్చడంలో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ప్రతి పల్లెకు జట్టు సంస్థ సేవలు చేరవేయడం అభినందించదగ్గ విషయమన్నారు. జట్టు సంస్థ రూపకల్పన చేసిన ప్రకతి వ్యవసాయ ప్రార్థన గీతం ''నేల తల్లికి వందనం మడి చేల తల్లికి వందనం'' రాష్ట్రమంతా ప్రకృతి వ్యవసాయ ప్రార్థన గీతంగా ఆచరించి, సంస్థ రూపొందించిన ప్రకృతి వ్యవసాయానికి చెందిన 18 రకాల వాచకాలు ప్రతి రైతుకు, కార్యకర్తకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. ఇక్కడ తయారుచేసిన వ్యవసాయ పరికరాలు తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం కలిగిన వీడర్లు తయారు చేయడం, మార్కెట్ రేటు కంటే తక్కువగా లభించడం ఇంకా మునుముందు రైతులకు మరింత ఉపయోగపడే విషయ పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేయాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడడం, జీవవైవిద్యం పెంచే పంటలు వేయడం, భూమిలో సేంద్రీయ కర్బన శాతం పెంచాలని, సహజ వనరులను ఉపయోగించి స్వయం సమద్ధి సాధించే దిశగా మహిళా సంఘ సభ్యులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం జట్టు ట్రస్ట్ రజతోత్సవ సావనీర్ ఆవిష్కరణను, గ్రామీణ వికాస్ కేంద్రం సంస్థ సహకారంతో ప్రచురించిన గ్రంథం బాలసాహిత్య సరళిలో సహజ పంటల సర్వస్వం పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రకృతి వ్యవసాయ పుస్తక రచయితలకు రాయల్టీ, జ్ఞాపికలను, ట్రస్టీలకు జట్టు రజతోత్సవ పతకాల బహకరించారు. అలాగే ధర్మపక్షం బ్రోచర్ ఆవిష్కరించారు. అనంతరం విశ్రాంత ఐఎఎస్ అధికారి దమయంతి మాట్లాడుతూ సొంత లాభం కొంతమానుకొని పరులకు పరోపకారం చేయడం, ప్రకృతిని, జీవరాశులను నష్టం కలుగు చేసే ఏ విధమైన హానికరమైన పనులు చేయకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, సమాజంలో గౌరవింపబడేటట్లు పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాబార్డు డిడిఎం టి.నాగార్జున, మేనేజింగ్ ట్రస్టీ ఎం.ప్రసాదరావు, విశ్రాంత ఐఆర్‌ఎస్ మేడిశెట్టి తిరుమల కుమార్, విశాంత్ర డిఐజి కె.పి.సి గాంధీ, డిజిటల్ గ్రీన్ సంస్థ స్టేట్ ఇన్ఛార్జి కె.నరేంద్ర, కె.నరేంద్ర, జిల్లా ప్రకతి వ్యవసాయ ప్రబంధకులు పి.షణ్ముఖ రాజు, గ్రామీణ వికాస్ కేంద్రం వ్యవస్థాపకులు ఎ.అనిల్ కుమార్, జట్టు ఎగ్జిక్యూటివ్ ట్రస్టి ఎస్. ప్రహారాజ్. వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షులు, ఎఫ్‌పిఒ, డైరెక్టర్లు, రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.










