ప్రజాశక్తి-విఆర్.పురం
మండలంలోని శ్రీరామగిరి పంచాయతీ పరిధి, చొక్కానపల్లి గ్రామంలో తోడం రాజు ఐదేళ్లుగా సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని సోమవారం ఎంపిపి కారం లక్ష్మి, రైతు సంఘం, సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి సారవంతమై, భావితరాల వారికి ఉపయోగపడుతుందని, వివిధ వ్యాధులకు మనిషి దూరం ఉండవచ్చని తెలిపారు. రసాయనిక ఎరువులు వాడి పండించిన కూరగాయలు, ధాన్యం, మిర్చి తినడం వలన అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. రైతు సహాయక వేదిక నుంచి భూమిపుత్ర పురష్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని అందుకున్న రాజును ఎంపిపి అభినందించారు. రైతు సంఘ నాయకులు సోయం చిన్నబాబు మాట్లాడుతూ. ఆర్థికంగా వెనుకబడిన గిరిజన కుటుంబంలో పుట్టి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచే తోడం రాజుకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం చేస్తే ఇంకొంత మంది రైతుల చేత ప్రకృతి వ్యవసాయం చేయించవచ్చని తెలిపారు. కలెక్టర్, ఐటిడిఎ పిఒ ఆర్థిక సాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్ కుమార్, చిన్నమటపల్లి ఎంపీటీసీ పూనెం ప్రదీప్ కుమార్, సిపిఎం నాయకులు పంకు సత్తిబాబు, పొడియం శ్రీరామ్మూర్తి, గుండెపూడి లక్ష్మణరావు, ఆత్మకూరు కాంతారావు, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, నాళ్లరపు చందర్రావు, నేర్రిబోయిన రాజు, సున్నం శ్రీను తదితరులు పాల్గొన్నారు.










