Jul 28,2023 20:31

మహిళా రైతుకు విత్తనాల కిట్‌ను అందజేస్తున్న జెసి

రాయచోటి : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రూ.1.37 కోట్ల ఖర్చుతో 1368 మంది ప్రకతి వ్యవసాయం చేస్తున్న ఎస్‌సి రైతులకు విత్తనాలను సరఫరా చేశామని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఎస్‌సి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకం (పిఎంఎజెఎవైౖ) కింద జిల్లాలో ప్రకతి వ్యవసాయం చేస్తున్న ఎస్‌సి రైతులకు విత్తనాల కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు సాధికార సంస్థ వారు జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో సేంద్రీయ పద్ధతిలో ప్రకతి వ్యవసాయం చేస్తున్న 1368 మంది ఎస్‌సి రైతులను గుర్తించామని పేర్కొన్నారు. ఎస్‌సి రైతులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు విలువ చేసే వివిధ విత్తనాల కిట్టును రాయితీతో సరఫరా చేశామన్నారు. జొన్నలు, మొక్కజొన్న, జీలగలు, పిల్లి పెసర, జనుములు, రాగి, కొర్ర, సజ్జ, పొద్దుతిరుగుడు, మినుములు, పెసలు, కందులతో పాటు కిచెన్‌ గార్డెన్‌ కిట్‌ తదితరాలు ఉంటాయన్నారు. ఈ కిట్టును రైతులు సద్వినియోగం చేసుకోని అభివద్ధి చెందాలన్నారు. వారు సాగు చేసే పొలంలో కనీసం 20 సెంట్లలో ప్రకతి వ్యవసాయాన్ని సంవత్సరం పొడుగునా చేయాలని జిల్లాలో సేంద్రియ పద్ధతిలో ప్రకతి వ్యవసాయ విస్తీర్ణం పెంచాలని కోరారు. ప్రతి ఎస్సీ రైతు అదనపు ఆదాయ వనరులు ఏర్పరచుకోవాలని పేర్కొన్నారు. ఎస్‌సి కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్సీ వర్గాల అభివద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులతో రాష్ట్ర విత్తనాల అభివద్ధి కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీ రైతులకు విత్తనాలు, పిఎండిఎస్‌ కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క ఎస్సీ రైతుకు రూ.1870 విలువ చేసే సీడ్‌ టు సీడ్‌ కిట్లు, గట్ల మీద వేసేందుకు కంది, కిచెన్‌ గార్డెన్‌ కిట్లను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఎస్సీ రైతులందరూ అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి డాక్టర్‌ హెచ్‌.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా ప్రకతి వ్యవసాయం చేస్తున్న ఎస్సీ రైతులు జిల్లాలో ఇంకా ఎవరైనా ఉంటే తమ కార్యాలయాన్ని లేదా క్షేత్రస్థాయిలో జడ్‌బిఎన్‌ఎఫ్‌ డిపిఎంను సంప్రదించాలని తెలిపారు. కార్పొరేషన్‌ ద్వారా ఒక్కొక్క ఎస్సీ రైతుకు రూ.7,630 విలువ కలిగిన ఇతర అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు, ఫెరామిన్‌ ట్రాప్స్‌, లూర్స్‌, ఎల్లో స్టికీ ప్లేట్స్‌, టార్పాలిన్స్‌, డ్రమ్ములు మొదలగునవి కూడా త్వరలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డిపిఎం యశోదమ్మ, రైతులు పాల్గొన్నారు.