Aug 27,2023 21:02

శ్రీ వరి సాగు చేస్తున్న గిరిజన మహిళ

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : నేటి సమాజంలో పుట్టుకతోనే అనేక వ్యాధులు వెంటాడుతున్న ఈ రోజుల్లో కలుషితమవుతున్న ఆహార సంపదలను, సంప్రదాయ ప్రకృతి సేంద్రియ పంటలుగా మలుచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం, వాతావరణంలో మార్పులు, కలుషిత ఆహారం వల్ల మనిషి రోగాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. బిపి, షుగర్‌ అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా తర్వాత కూడా చాలామంది ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ శాతం రసాయనిక ఎరువుల్లేని స్వచ్ఛమైన ఆహారంతో పాటు చిరుధాన్యాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జట్టు సంస్థ సహకారంతో ఏజెన్సీలో గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ ఆర్థికంగా బలోపేతం చెందుతున్నారు.
మండలంలోని 27పంచాయతీల్లో 189 గ్రామాల్లో 8772 మంది గిరిజన రైతులు 22687 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చు. మరోవైపు ప్రకృతిని, పర్యావరణం పరిరక్షణకు వీలుంటుంది. కార్బన్‌ శాతం పెంచడం వల్ల భూతాపం తగ్గించాడానికి వీలుంటుంది. రైతులు శ్రీవరి, శ్రీరాగి పంటలతో పాటు అంతర పంటగా చిరుధాన్యలు, ఆకు కూరలు, కాయగూరలు పండిస్తున్నారు. వరి విస్తీర్ణం తగ్గించి చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పప్పు ధాన్యాలు విస్తీర్ణం పెంచడం అధిక ధరలకు అమ్మకంతో ఆర్థికంగా అభివృద్ధి సాధించాడానికి వీలుంటుంది.
ఆదర్శ రైతు : ఎంపిటిసి మల్లేష్‌...
జీరో పెట్టుబడితో పంటల అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఇరిడి కడ్రక ఎంపిటిసి మల్లేశ్వరరావు గత రెండేళ్లుగా ఒకవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటేనే మరోవైపు తనకు ఉన్న మూడు ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఘనజీవామృతం, వేప కషాయం, నీమాస్త్రం పిచికానీ చేస్తూ అజోలాని పెంచేందుకు చర్యలు తీసుకుని పొటాస్‌ను తయారు చేసుకుని పంటలు పండిస్తున్నారు.
చిరుధాన్యాలకు పెరిగిన గిరాకీ....
గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో తరతరాల నుంచి గిరిజనులు పండించే చిరుధాన్యాలకు మంచి గిరాకీ ఏర్పడింది. కొండపోడు వ్యవసాయంలో చోడి, కొర్రలు, జొన్నలు, జుడుములు, కందులు, గంటెలు, రాగులు తదితర పంటలు పండిస్తున్నారు. కరోనా తర్వాత చిరుధాన్యాలకు బయట మార్కెట్లో బాగా డిమాండ్‌ పెరిగింది.
ఖర్చుల భారం తగ్గిందిలి..
ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే వేలకు వేలు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. మాలాంటి పేద రైతులు అప్పులు చేయక తప్పేది కాదు. జట్టు సంస్థ సహకారంతో తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాం.
కె. పువ్వల సుందరమ్మ ,
మహిళా రైతు, రాయగడ జమ్ము.
రసాయన ఎరువులు లేని పంట
ప్రకృతి వ్యవసాయంతో రసాయనిక ఎరువులు లేని పంటలు పండించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుంది. పంటలు పండించే విధానంలో జట్టు సభ్యుల సలహాలు, సూచనలు పాటించడంతో తక్కువ ఖర్చుతో పంటలు వేసుకోవడానికి వీలుంటుంది. ప్రతి ఒక్కరూ. ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలి.
ఎ.దేవి, మహిళా రైతు.