ప్రజాశక్తి - బలిజిపేట : మండలంలోని బర్లి, మిర్తివలసలో ఎపి సిఎన్‌ఎఫ్ డిపిఎం షణ్ముఖరాజు, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్ కుమార్ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర పరిశీలన శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రకృతి వ్యవసాయ రైతులైన తాన్న రామకృష్ణ, డాక్టర్ శంబంగి శ్రీనివాసరావు సాగు వివరాలను అడిగి తెలుసుకొని మరింత మెరుగైన దిగుబడుల కోసం సూచనలు, సలహాలు ఇచ్చారు. పరిశీలనలో భాగంగా మిర్తివలసలో గల బయో ఇన్పుట్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సెంటర్లో గల 4000 లీటర్ల జీవామృతం, 500 లీటర్ల దశపర్ణిక, 200 లీటర్ల అగ్నాస్త్రం, 100 లీటర్ల బ్రహ్మాస్త్రం,100 లీటర్ల పంచగవ్య, 500 లీటర్ల పుల్లటి మజ్జిగ, 50 లీటర్ల మీనామృతం, 30 లీటర్ల ఎగ్ అమినో యాసిడ్, ఎల్లో ప్లేట్లు, పెరమొన్ ట్రాపర్స్, నవధాన్యాలు, కాయగూర విత్తనాలను పరిశీలించి ప్రకృతి వ్యవసాయ రైతులు ఈ బయో ఇన్పుట్ సేవలను వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ద్రావణాలు, కషాయాల వాడకం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని, దీంతో పాటు ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు శ్రీరాములు, నరసింహ, సిఆర్‌పిలు లక్ష్మి, తిరుపతిరావు, రైతులు పాల్గొన్నారు.










