Jul 18,2021 12:56

సువాసనలు గుప్పిస్తూ, రంగురంగుల పూలతో పలకరించే కొన్ని జాతుల మొక్కలను మన తెలుగు రాష్ట్రాల్లో 'దేవాలయం మొక్కలు'గా పిలుస్తూ ఉంటారు. పల్లెల్లో ప్రతి తెలుగింట ఈ జాతి మొక్కల్లో ఒకటో, రెండో కొలువుదీరి కనువిందు చేస్తుంటాయి. వీటి పువ్వులు దండలు, మాలలు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకా అభినందనలు, ఆప్త నివాళికి నిత్యం అందుబాటులో ఉంటాయి. ప్రకృతి వరాలైన ఈ మొక్కలు ఎన్ని రకాలో తెలుసుకుందాం.

దేవాలయం మొక్కలను కుండీల్లోనూ, నేలమీదా పెంచుకోవచ్చు. వీటిని టెంపుల్‌ ట్రీ మొక్కలు అని పిలిచినప్పటికీ పాఠశాలలు, కార్యాలయాలు, పార్కులు, మాల్స్‌, పంక్షన్‌ హాళ్లలో నిత్యం పువ్వులతో సందడి చేస్తుంటాయి.

                                                                                   నందివర్ధనం

నందివర్ధనం

    నక్షత్ర తళుకుల్లాంటి తెల్లటి పూలను నిత్యం నిండుగా పూసేది నందివర్ధనం. అందుకే దీన్ని శ్వేతవర్ధిని అని కూడా అంటారు. గ్రామాల్లో తెలుగు లోగిళ్ళలో ప్రతి ఇంటా తెల్లటి దరహాసంతో స్వాగతం పలికే పూల కల్పవల్లి నందివర్ధనమే. లేత సువాసనలతో ఇవి పుంఖాను పుంఖాలుగా పూలు పూస్తాయి. ఐదు నుంచి పది అడుగుల ఎత్తు వరకూ పెరిగే వీటిని కుండీల్లోనూ, నేలమీదా పెంచుకోవచ్చు. చిన్ని చిన్ని పువ్వులతో అడుగు ఎత్తు పెరిగే సరికొత్త డ్వార్ప Û(పొట్టి) రకం మొక్కలూ ఇటీవల అందుబాటులోకి వస్తున్నాయి. నందివర్ధనంలో ముద్దా, రేఖలాంటి పదుల సంఖ్యలో రకాలున్నాయి.
 

                                                                                   అల్లెనంద

అల్లెనంద

    ఇది మీటర్‌ ఎత్తువరకు పెరుగుతుంది. కానీ నిత్యం ఈ మొక్క నిండుగా పువ్వులు పూస్తుంది. అవి లేత సుగంధ పరిమళాలు అద్దుతాయి. వీటి ఆకులు సన్నగా దళసరిగా ఉంటాయి. ఈ మొక్క అపాసైనే కుటుంబానికి చెందింది. ఈ మొక్కను అల్లమండా కాథర్టికా, బటర్‌ కప్‌ పుష్పం, కొమ్మన్‌ ట్రంపెట్‌ వైన్‌, బంగారు కప్పు, బంగారు ట్రంపెట్‌ వైన్‌లాంటి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మన తెలుగోళ్లు 'మినీ ఆల్మండా' అని కూడా అంటుంటారు. మధ్య, దక్షిణ అమెరికా దేశాల మొక్కిది. ఇందులో వందల రకాల మొక్కలున్నాయి. వీటిలో పాదులా పాకే తీగ జాతి మొక్కలూ ఉంటాయి. వీటిని కుండీల్లోనూ, నేలమీదా చక్కగా పెంచుకోవచ్చు. బోర్డర్‌ మొక్కలుగానూ ఇవి ఉపయోగపడతాయి. వీటి పూలను ఎక్కువగా మందుల, అగరవత్తులు, సుగంధ ద్రవ్యాల తయారీకి, అలంకరణకు ఉపయోగిస్తారు.
 

                                                                            పారిజాతం

పారిజాతం

   పారిజాతం పూలనే 'దేవతా పూలు' అంటారు. సుగంధ పరిమళాలతో పలకరించే తెల్లని సుకుమారాలివి. ఈ పువ్వు మధ్యభాగంలో కాషాయం సింధువుతో అపురూపమైన అందం పారిజాతానిది. పువ్వుకుండే కాడనూ కాషాయంలో అలరిస్తుంది. ఐదు అడుగుల వరకూ పెరిగే ఈ మొక్క ఇంటికి మరింత అందాన్నిస్తుంది. వీటి పువ్వులు రాత్రులు వికసించి, తెల్లవారేటప్పటికీ చిరుజల్లులు కురిసినట్లు నేలపై రాలి ఉంటాయి. అవి చూడటానికి చెట్టుకింత తివాచీ వేసినట్లే ఉంటుంది. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
 

                                                                          పచ్చ గన్నేరు

పచ్చ గన్నేరు

    విరిసీ, విరవనట్టుండే లేత పసుపు రంగు పూలనిచ్చేవి పచ్చగన్నేరు. సన్నటి పొడవాటి ఆకుపచ్చని పత్రాలు దళసరిగా ఉంటాయి. దీని మొక్క పొదలా పది అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. లేత ఆరెంజ్‌, తెలుపు రంగుల పూలనిచ్చే రకరకాల మొక్కలు వీటిలో ఉంటాయి. ఈ మొక్కలను దేవాలయాలు, ఇంటిముందు, రోడ్డు మధ్యన డివైడర్‌లోనూ పెంచుతుంటారు. కాకపోతే వీటి కాయలు విషతుల్యం. వీటికి పెద్దగా నీటివనరు అవసరం లేదు. చాలా లోతుకి వీటి వేర్లు వెళ్లడం వల్ల భూమి లోపల పొరల నుంచి నీళ్లు తీసుకుంటాయి. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. అలంకరణకు, మందులు తయారీలోను గన్నేరును ఉపయోగిస్తారు.
 

                                                                                    కరివేరు

కరివేరు

    పదిహేనడుగుల వరకు పెరిగే పూలమొక్క కరివేరు. ఇది కూడా గన్నేరు జాతి మొక్కే. అన్నివైపులా పలవలు విచ్చుకుని లేత పింకు రంగు పువ్వులు పూస్తాయి. పువ్వులు రేఖ గులాబీ మాదిరిగా ఉంటాయి. నాటిన రెండో ఏటనే పూతకు వస్తాయి ఇవి. ఇందులో తెలుపు రంగు పువ్వులు పూసే మొక్కలు కూడా ఉన్నాయి. పువ్వులు ఒకరకమైన మత్తు గొలిపే వాసన వస్తాయి. ఈ పూలను పూజకు, అలంకరణకు, ఉపయోగిస్తుంటారు. ఆకులు దళసరిగా గన్నేరు మొక్క ఆకులు కంటే కాస్త పెద్దగా ఉంటాయి. ఇళ్లలోను, పార్కులు, పాఠశాలలు, రోడ్‌ డివైడర్‌ మధ్య వీటిని నాటుతారు.
 

                                                                       పసుపు బాకా పూలమొక్క

 పసుపు బాకా పూలమొక్క

   కాంతివంతమైన పసుపు పూలను గుత్తులు గుత్తులుగా పూసేది పసుపు బాకా పూలమొక్క. టికోమా గుసాడియా శాస్త్రీయ నామంతో పిలిచే ఈ మొక్కను పసుపు గంటపూల మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఇవి వేసవి ఆరంభం నుంచి పువ్వులు పూస్తాయి. పువ్వుల్లో మకరందానికి సీతాకోక చిలుకలు, తేనెటీగలు, హమ్మింగ్‌ బర్డ్స్‌, తూనీగలు నిత్యం ఈ పూల మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాయి.
 

                                                                             శివలింగ వృక్షం

శివలింగ వృక్షం

   శివలింగ వృక్షం పూలను నాగమల్లి పుష్పాలు, మల్లికార్జున పుష్పాలు అని పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి. శాస్త్రీయ నామం కౌరౌపిటా గియానెన్సిస్‌. ఆంగ్ల పరిభాషలో కేనన్‌ బాల్‌ ట్రీ అంటారు. ఇది దక్షిణ అమెరికా, దక్షిణ భారతదేశంలోనూ కనిపిస్తాయి. వందల సంవత్సరాలు ఉండే ఇది 100 అడుగుల వరకూ ఎత్తు పెరుగుతుంది. వీటి పూల మధ్యభాగం పడగ విప్పిన సర్పం వలే ఉంటుంది. లోపల శివలింగాకృతి ఉంటుంది. వీటి పుష్పాలు కొమ్మలకు పూయకుండా, ఊడల్లాంటి వేలాడే వేరులకు పూస్తాయి.
 

                                                                        దేవగన్నేరు

    నిరంతరం పూలు పూస్తూ పరిమళాలు వెదజల్లేవి దేవగన్నేరు మొక్కలు. 25 అడుగుల ఎత్తు వరకూ పెరిగి, వృక్షం మానులు తీరుతుంది. దాదాపు పది అంగుళాలు పొడవు ఆకులు ఉంటాయి. గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది. తెలుపు, లేత పసుపు, లేత పింకు రంగుల్లో దేవగన్నేరు పువ్వులు ఉంటాయి. పువ్వు రేఖలు తెల్లగా ఉండి మధ్యభాగం వేరే రంగుతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ చెట్టు 100 ఏళ్ళ పైబడి బతుకుతుంది.
 

                                                                         మద్రాసు కనకాంబరం

మద్రాసు కనకాంబరం

    ముదురు కాషాయరంగు పూలతో గుభాళించే మొక్క మద్రాస్‌ కనకాంబరం. ఇది మూడు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీన్ని 'టికోమా ఆరంజ్‌' అని అంటారు. ఈ మొక్కను కుండీల్లోనూ పెంచుకోవచ్చు. జులై నెలలో పూల కాపు మొదలవుతుంది. బోర్డర్‌ ప్లాంట్లుగా కూడా వీటిని పెంచుకోవచ్చు. ఇవి దేవాలయాల్లో ఎక్కువగా ఉంటాయి. అన్నిచోట్లా పెంచుకోవచ్చు.
 

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506