మనం ఒకటి, రెండు పూలమొక్కలు చూస్తేనే తెగ సంబరపడతాం. అలాంటిది వందల రకాల పూల మొక్కలు కోట్ల సంఖ్యలో ఓ చోట కొలువుదీరి కబుర్లాడుతుంటే.. ఆ సుందర దృశ్యం చూడతరమా?! నర్సరీ పూలమొక్కలే కాదు కొబ్బరి, మామిడి, జామ, సపోటా వంటి పండ్ల తోటలు, మల్లి, జాజి, కనకాంబరం, చామంతి, లిల్లీ, గులాబీ వంటి పూలతోటలు అడుగడుగునా దర్శనమిచ్చే విరివనాల వసంతం కడియం. గోదారి నదీ తీరాన అచ్చంగా విచ్చుకున్న ప్రకృతి పూలసీమ ఇది. ఈ సీజన్‌లో కడియం పూలతోటలు అటు కుసుమ విలాసం, వన ప్రియుల ఆగమనంతో కళకళలాడుతూ ఉంటుంది.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వనవిందులకు కడియం తోటలు ఆతిథ్యాలైపోతాయి. ఈ సీజన్లో ఎక్కడ చూసినా వనభోజనాల సందడే కనిపిస్తుంది. ఇది గతం. ప్రస్తుతం కడియం విరివనాలు వన సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. అందుకు విశ్వవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా ఒక కారణం కాగా, ఈ ఏడాది తొలకరి ఆది నుంచీ విస్తారంగా కురిసిన వర్షాలు, తుపాన్లు మరొక కారణం. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా కడియం పూదోట సందర్శకులు లేక బోసిగా ఉంది. కోవిడ్-19 నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ మనం కడియం విరి వన సౌందర్యాన్ని, పండ్ల తోటల మాధుర్యాన్నీ, చెట్ల చల్లని గాలులనీ ఆఘ్రాణిస్తూ ఆస్వాదిద్దాం.
ఆకుపచ్చని తోటల్లో జల జల పారే నీటి బోదులు.. వాటిలో ఎగసి పడే చిరు చేపల చిందులు తేరిపార చూసే దృశ్యాలు.. మిగల మగ్గిన పండ్లను ఆరగిస్తూ చెట్లపై పక్షులు చేసే హడావిడి.. ఎంగిలి పండ్లను చెట్ల నుంచి జారవిడిచే పక్షులు.. వాటికోసం కాసుకూర్చున్న కోతి మూకలు చేసే అల్లరి.. ఇవన్నీ నయనానందంగా తిలకించాల్సిందే. ఇంధ్రధనస్సు దివి నుంచి భువికి దిగుతుందా అన్నట్టు కనుచూపు మేర విస్తరించిన రంగు రంగుల పూలతోటలు. విప్పారిన పూల పుప్పొడుల్లో మకరందాన్ని జుర్రేసుకోవడానికి తుమ్మెద, తూనీగలు చేసే ఝాంకార నాదాలతో మనసులు శృతి కలుపుతాయి. చెట్లు లేలేత చిగుళ్లు కిషలయ విన్యాసం మనస్సుని మైమరిపిస్తాయి. దారి పొడువునా సుగంధ పరిమళాలు గుప్పిస్తూ సువాసనలతో స్వాగతం పలుకుతాయి. గోదారి అలలతో ప్రళయ ఝంఝమ్మాడి ఉన్నట్టుండి ఒక్కసారిగా తేలియాడి.. చెంతనే వున్న పూదోటలో పరిమళాలను చుంబించిన చల్లని గాలులు చెక్కిళ్ళు తాకుతూంటే.. మాటలకందని మౌనభావాలెన్నో హృదయాల్లో తుళ్లింతలాడుతుంటాయి. వేల ఎకరాల్లో వందలాదిగా విస్తరించి ఉన్న కడియం తోటల్లో విహారం.. ప్రకృతి ఒడిలో పలవరింత.. అడుగడుగూ పులకింతే. అడుగడుగునా ఉండే ఉసిరిచెట్లు సాంప్రదాయ వనప్రియులకు ఇక్కడ సహపంక్తి భోజనాలకు చక్కటి ఆతిథ్యమిస్తాయి.. అనుబంధాలు విచ్చుకుంటాయి. అందుకే ఈ సీజన్లో విదేశాల నుంచి సైతం సందర్శకులు కడియం నర్సరీలకు వస్తుంటారు.
విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, కులాలు, వర్గాలు, వృత్తులు వారీగా ఇరుగూ పొరుగూ సమూహాలుగా, కుటుంబసమేతంగా వచ్చి మనసుకు రెక్కలు తొడిగి, ఈ వనాల్లో రోజంతా విహరించి, వన విందారగించి, హాయిగా వెళుతుంటారు. సుందర దృశ్యాల కొలువుగా, మంజుల భావాలకు నెలవుగా ఉండే కడియం పూల నేల మీద కొద్ది క్షణాలు గడిపినా అది జీవితమంతా మధురానుస్మృతిగా మిగిలిపోతుంది.
కడియం పూల సోయగం తెలుగు వెండితెరపైనా వెలుగొందుతోంది. అందుకే సినీ కెమెరాల కళ్ళు నిత్యం ఈ పూదోటల చుట్టూ ప్రదక్షిణ చేస్తూంటాయి. వింత వింత పక్షులెన్నో చెట్ల మీద దోబూచులాడుతూ జీవవైవిధ్య ఝరి కురిపిస్తూ సందర్శకులను మురిపిస్తాయి.
- చిలుకూరి శ్రీనివాసరావు
8985945506