ప్రజాశక్తి-చింతూరు
చింతూరు ఏజెన్సీలో మార్చి మొదలు ఏప్రిల్ వరకు అడవుల్లో ప్రకృతి పరంగా లభించే ఫలసాయాల్లో పాల పండ్లు ముఖ్యమైనవి. చూడటానికి వేపకాయలాగ ఉండే పాల పండ్లు రుచిలో మాత్రం పాలు తేనె కలిపి సేవిస్తే ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే అధికమైన రుచిని కలిగి ఉంటాయి. కొద్దిగా జిగురు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. పాల పండ్లు అడవిలో సహజసిద్ధంగా లభించే అరుదైన పండ్లు. వీటిలో అనేక పోషక విలువలు ఉంటాయి. బాలింతలు పాల పండ్లను ప్రతిరోజూ తింటే పాలు వృద్ధి ఎక్కువగా ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. సీజన్ వారీగా, ప్రకృతి సిద్ధంగా అడవిలో లభించే ఈ పండ్లు చిన్న పిల్లలకు ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
ఈ సీజన్లో పాల పండ్లను సేకరించేందుకు గిరిజనులు చిన్న పెద్దలు అడవికి వెళుతుంటారు. అడవిలో సేకరించిన పాల పండ్లను మట్టి లేకుండా శుభ్రంగా మంచి నీటిలో కడిగి, వెదురు బుట్టలో వేస్తారు. పాల పండ్లు జిగురును కలిగి ఉంటాయి కాబట్టి ఎటువంటి దుమ్ము ధూళి పడకుండా జాగ్రత్తలు వహిస్తారు. వెదురు బుట్టలతో వీటిని మండల కేంద్రానికి తెచ్చి గ్లాసు ఐదు రూపాయలు చొప్పున గిరిజన మహిళలు విక్రయిస్తున్నారు. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారు వీటిని కొనుగోలు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం ఈ ఒక్క నెలలో మాత్రమే లభించే పాల పండ్లు, మళ్లీ ఏ సీజన్లో తినాలన్నా కనిపించవు.










