Jul 27,2021 06:21

    కుండ ఒలకపోసినట్లు వర్షాలు, మిన్ను విరిగి పడినట్లు వరదలు, సలసలమనే ఉష్ణోగ్రతలు, ఎముకలు కొరికే శీతల గాలులు దేశంలో ఏదోక చోట నిత్యకృత్యమవుతున్నాయి. ఈ విపత్తులు ప్రకృతి ప్రకోపమే అయినా హేతువు మాత్రం అవధుల్లేని లాభాపేక్ష. విచ్చలవిడిగా సాగిస్తున్న సహజ వనరుల విధ్వంసం. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా పూర్తిగా విస్తరించనైనా లేదు అప్పుడే మహారాష్ట్రను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ఏకమై బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగఢ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. జన జీవనం స్తంభించింది. లక్షల మంది తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆస్తి, పంట నష్టం చెప్పనలవి కాదు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ వానలు, వరదలు పోటెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో సైతం వానలు, వరదలు భయపెడుతున్నాయి. మామూలుగా తొలకరిలో కురిసే వర్షాలు అంతగా నష్టం కలిగించవు. కానీ భారీ నుండి అతి భారీ వర్షాలు పంటలకు, ఆస్తులకు అపార నష్టం కలిగించడం ఇప్పుడే చూస్తున్నాం. వర్షాలు అన్ని ప్రాంతాల్లో పడ్డాయా అదీ లేదు. చాలా సందర్భాల్లో అతివృష్టి, అనావృష్టి కలిసే వస్తున్నాయి. ఎ.పి లోనే చూసుకుంటే నిన్న మొన్నటి వరకు ఉత్తరాంధ్ర, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్ర వర్షాభావంలో మగ్గాయి. రెండు రోజులు వానలు దంచికొట్టడంతో పరిస్థితి మారింది. నిరుడు మరొక విధం. రాష్ట్రమంతటా వానలు బాగున్నా ఖరీఫ్‌ చివరి వరకు ఉత్తరాంధ్ర కరువులోనే కొట్టుమిట్టాడింది. ఇలాంటి వాతావరణ విభిన్నత ఒక్క మన రాష్ట్రానికే పరిమితమై లేదు. దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోనూ ఉంది.
     నయా-ఉదారవాద విధానాలు మొదలయ్యాకే వాతావరణ మార్పులు అనుభవంలోకి వచ్చాయన్నది వాస్తవం. అమెరికాలో భీకర తుపాన్లు, వరదలు, కార్చిచ్చు, యూరప్‌లో వరదలు, మాస్కోలో ఎన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు, చైనాలో వెయ్యేళ్లల్లో ఎరుగని వర్షాలు, వరదలు...ఇవన్నీ పర్యావరణ సమతౌల్యం దెబ్బ తిన్న ఫలితమని శాస్త్రవేత్తలు నెత్తీనోరు బాదుకుంటున్నారు. పరిస్థితి హెచ్చరికలు, ప్రమాద ఘంటికల దశను దాటిపోయిందనీ నొక్కి వక్కాణిస్తున్నారు. రెండు దశాబ్దాల్లో మనకు ఎదురైన అనుభవాలు చాలానే ఉన్నాయి. భూతాపం వలన హిమాలయాలు కరుగుతున్నాయని గుర్తించగా ఆ పర్యవసానం 2013లో ఉత్తరాఖండ్‌ చవిచూసింది. వరదల తీవ్రత పెరగడానికి అక్కడి నదులపై హద్దూపద్దూ లేకుండా నిర్మించిన జల విద్యుత్‌ ప్రాజెక్టులే కారణమని తేలింది. తరచూ గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వరదల బారిన పడటానికి సహజ సిద్ధంగా ఏర్పడిన పడమటి కనుమల విధ్వంసమే కారణమని శాస్త్రీయంగా నిర్ధారించినా చర్యలు శూన్యం.
     మానవ తప్పిదం, ప్రణాళికా లోపం వలన చిన్న వానకే మన నగరాలు అస్తవ్యస్తమవుతున్నాయి. ఉదాహరణ ఆర్థిక రాజధానిగా పిలవబడే ముంబయి. ముందటేడు వరదలకు ఆ నగరం ఎంతగా దెబ్బ తిన్నదో ఎరుకే. ముంబయి మాత్రమే కాదు కోల్‌కతా, చెన్నయి, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ మహానగరాలతో పాటు ఎ.పి లోని విశాఖపట్నం, విజయవాడ సైతం అంతే. కారణాలు తెలిసినవే. చెరువులు, కుంటలు, నదులు, కాల్వల దురాక్రమణలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. అడవుల దోపిడీ, చెట్లు, మడ అడవుల నరికివేత, కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ నిబంధనల ఉల్లంఘన, పర్యావరణ ప్రభావశీలత అంచనాల్లేకుండా భారీ ప్రాజెక్టుల నిర్మాణం, పారిశ్రామికీకరణ నీరు, వాయు, భూమి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఫలితంగా రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. సముద్రాల్లో సునామీలు పుట్టుకొస్తున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌, ఎల్‌నినో, ధృవాల్లో మంచు కరగడం, ఓజోన్‌ పొరకు చిల్లు ఉండనే ఉన్నాయి. ప్రకృతి వనరులను మానవ అవసరాలకు పరిమితంగా వాడుకోవాలి. లాభాలు పొగేసుకోడానికి కొల్లగొడితే మానవ మనుగడకే ప్రమాదం. పారిశ్రామిక దేశాలు ఈ తత్వాన్ని తలకెక్కించుకోవాలి. మన పాలకులు నయా-ఉదారవాద విధానాలు విడనాడి పర్యావరణ పరిరక్షణకు సామ్రాజ్యవాద దేశాలను సవాల్‌ చేయాలి.