Jan 09,2022 12:42

   ఠాత్తుగా చెట్టుపై కలకలం. పక్షులు భయంతో అరుస్తూ అటూ ఇటూ ఎగురుతున్నాయి. పొలంలో మంచెపై మగత నిద్రలో ఉన్న మల్లన్నకు హఠాత్తుగా తెలివొచ్చింది. అప్పుల వాళ్లు వెంటపడుతున్న కల చెదిరిపోయింది. పొలం గట్టుపై ఉన్న బూరుగు చెట్టువైపు చిరాగ్గా చూశాడు. 'వెధవపాము మళ్లీ వచ్చినట్టుంది. ఆ మూగజీవాల పాలిట శనిలా దాపురించింది. ఏడాది నుంచి ఆ పక్షుల ఉసురు పోసుకుంటోంది. గుడ్ల సమయంలోనే కొన్ని, పుట్టాక మరికొన్ని దానికి ఆహారంగా మారుతున్నాయి. ఆ మూగజీవాల మౌనరోదనకు అంతులేదు..' అని తల్చుకుంటూ జాలిపడ్డాడు.
    'కొట్టి చంపేద్దామంటే అసలు కనిపిస్తే కదా. ఏ తొర్రలో దాక్కుంటుందో, ఏ రాత్రప్పుడో ఆ మూగజీవాల్ని మింగేస్తుంటుంది. పాపం ఈ పాము బాధ భరించలేక చాలా పక్షులు ఎగిరిపోయాయి. కొన్ని మాత్రమే ఉంటున్నాయి. వాటిదీ నాలాంటి పరిస్థితే' అని తల్చుకున్నాడు. మల్లన్న రెండెకరాల సన్నకారు రైతు. ఖరీఫ్‌లో వరి పండిస్తాడు. తర్వాత ఓ ఎకరాలో పెసర, మరో ఎకరాలో మినుము వేస్తాడు. ఏడాదిపాటు ఆ పంటలే అతనికి జీవనాధారం. అతని పొలం గట్టుపై తాతలనాటి ఓ బూరుగు చెట్టుంది. ఆ చెట్టు కొమ్మలపై వందలాది పక్షుల ఆవాసాలున్నాయి. పొలంతోపాటు ఆ చెట్టు, పక్షులతోనూ మల్లన్నకు అనుబంధం ఉంది. ఆ పక్షుల గుండెచప్పుడు అతనికి వినిపిస్తుంది. వాటి ఆవేదన అతనికి కనిపిస్తుంది. కానీ ఇప్పుడవి విలవిల్లాడిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నాడు.
     'ఆరుగాలం శ్రమించి, నేను పంట పండిస్తాను. పంట చేతికొచ్చే సమయానికి కరువో, వరదో ఆ పంటను మింగేస్తుంది. ఆ పక్షుల పిల్లల్ని ఈ పాము మింగేస్తుంది. నా కష్టానికి ఫలితం దక్కదు. పక్షుల వేదనకు పరిష్కారం లేదు' అని ఆలోచిస్తూ మల్లన్న నిద్రలోకి జారుకున్నాడు. ఎండ చురుక్కుమనిపించడంతో తెలివొచ్చింది. కళ్లముందు పంట కళకళలాడుతోంది. మరో వారం రోజుల్లో చేను కల్లానికి చేరిపోతే.. ఇక తన కష్టాలు గట్టెక్కినట్టే. మూడేళ్ల సాగు కష్టాల నుంచి ఈ ఏడాదైనా విముక్తి లభిస్తుందని ఆశతో దిగుబడిని లెక్క వేసుకుంటున్నాడు.
     'ఏం మల్లన్నా.. ఈ ఏడాది నీ పంట పండింది, అందుకేనా అంత హుషారు' పొలం నుంచి వస్తూ పలకరించాడు తోటి రైతు సూరీడు. 'నువ్వన్నది నిజమేరా సూరీడు. ఈ ఏడాది నాలుగు గింజలు కళ్లజూస్తానన్న నమ్మకం కలుగుతోంది. నేలతల్లి కరుణించింది. ప్రకృతి కన్నెర్రజేయకుంటే చాలు..' ఆశగా అన్నాడు. 'మన అనుభవాలు అలాంటివి. ఆ మాత్రం భయం సహజమేలే. అయినా ఎంత, మరో వారం రోజులే కదా, ఈలోగా ఏం కొంప మునుగుతుంది. నిశ్చింతగా ఉండు..' సూరీడు ధైర్యం చెప్పాడు. 'ఏమోరా, నోటికి ముద్ద అందాలంటే గిన్నె నుంచి చెయ్యి నోటి వరకు చేరాలి కదా!' నవ్వుతూ అన్నాడు మల్లన్న.
     'అదీ నిజమేలే, లాటరీలాంటి బతుకులు మనవి. ఏం చేస్తాం. మట్టిమనుషులంటే ప్రకృతికీ చిన్నచూపే'. 'అందరి నోటికి ఇంత ముద్ద అందించే మన నోటికి మాత్రం ముద్ద చేరాలంటే అదృష్టం కలిసి రావాలిరా! ఇది దేవుడు పెట్టిన శాపమో? రైతు పాపమో? అర్థం కాదు' నిర్వికారంగా అన్నాడు మల్లన్న. 'నాన్నా.. అమ్మ బువ్వకు రమ్మంటోంది' అని కూతురి పిలుపుతో భోజనానికి లేచాడు మల్లన్న. రెండు రోజుల నుంచి ఆ పూటా, ఈ పూటా పొలానికి వెళ్లి వస్తున్న మొగుడి కళ్లలో ఆనందం చూసి సాయమ్మకు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది. 'ఎన్నాళ్లయిందో నీ ముఖాన నవ్వు చూసి' అంది. 'సంతోషంగా ఉండాలని నాకుండదా సాయిలూ. మట్టి మనుషులం, పంట నాదారుగా ఉంటే మనలాంటి పేద రైతులకు అంతకు మించిన ఆనందం ఏటుంటాది'. 'నిజమేలే.. ఈ ఏడాదికి ఇంక అన్ని ఆటంకాలూ పోయినట్టేనా మామా..' సాయిలు మొగుడివైపు చూస్తూ అంది. 'పోయినట్టేనే, రెండు మూడు రోజుల్లో కోత కోసి, మూడు నాలుగు రోజులు ఓదిలు ఆరాక తెచ్చి కల్లంలో పడేస్తే ఈ ఏడాది కష్టం చేతికి వచ్చినట్టే. సేను కుప్ప చూస్తే మిల్లు షావుకారు ఖర్చుకు డబ్బులిస్తాడన్న ధైర్యం ఉంది' అంటూ నోట్లో ముద్ద పెట్టుకుంటూ పొలమారాడు. నోటిలో అన్నం కాస్తా కూర్చున్న చోటంతా తుళ్లి పడింది. సాయిమ్మ మొగుడి తలపై చేతితో మొత్తుతూ 'తినేటప్పుడు మాట్లాడకూడదు. నాదే తప్పులే, అనవసరంగా నిన్ను మాట్లాడించాను. ఎవరో తల్చుకుంటున్నట్టున్నారు'. 'మన గురించి ఎవులు తల్చుకుంటారే, అప్పులోళ్లు తప్ప' అంటూ నీళ్లుతాగి, మళ్లీ నోట్లో ముద్దపెట్టుకుంటూ అన్నాడు మల్లన్న. 'అవసరానికి డబ్బిచ్చినోళ్లు అడక్కుండా ఉంటారా. బాకీలు వసూలు చేసుకోవాలని ఆలకీ ఉంటాది కదా!'. 'నువ్వన్నదీ నిజమే, ఆలు మనల్ని దోచుకున్నంత దోచుకున్నా అవసరానికి చేతిల డబ్బెడతారు. వడ్డీల మీద వడ్డీలు ఏసి పాపం పెంచినట్టు అప్పు పెంచేసినా కష్టం వచ్చినప్పుడు చూసీచూడనట్టుంటారు. ఆలదీ మనదీ జన్మజన్మల బందమే' అని నవ్వుతూ అన్నాడు. 'తింటూ నవ్వకు, మళ్లీ పొలమారిపోతావు. ముందే సెపుతున్నానని ఏటీ అనుకోకు. ఈ ఏడాది పండక్కి పెద్దదానికి బట్టలు పెట్టడం మరిసిపోకు. రెండేళ్లుగా ఆ మాటే మర్చిపోయావు. అందల నీ తప్పేటీ లేదనుకో, చెయ్యి సాగనప్పుడు నువ్వయినా ఏటి సెయ్యగలవు? చేతికి నాలుగు డబ్బులు వచ్చినప్పుడైనా ఆడపిల్ల చేతిల ఓ రూపాయి పెట్టకపోతే దాని మొగుడి దగ్గిరా, అత్తోరింటిల దానికి నామోసి కదా!' అని సాయమ్మ మొగుడివైపు ఆశగా చూస్తూ అంది.
'నాకు తెలియదా సాయిలు, కూతురికి ఓ చీర, రవికా పెట్టలేని నా బతుకు చూసి మనసెంత విలవిల్లాడిపోతుందో. ఏటి సేస్తాం.. చేతికి ఆదాయం వచ్చినట్టే వచ్చి పోతుంటే.. మూడేళ్లుగా మన కష్టాలు నీకు తెలియనివా? కూలోనాలో చేయగల శక్తి ఉంది. కాబట్టి పట్టెడు మెతుకులైనా తినగలుగుతున్నాం. మనసుకు కష్టమనిపించినప్పుడు ఒక్కోసారి ఎందుకొచ్చిన తంటా, వదిలించుకుని ఏ పట్నానికో ఎల్లిపోతే కూలోనాలో చేసుకుని ప్రశాంతంగా బతకొచ్చనిపిస్తుంది తెలుసా?' అని చేతులు కడుక్కుంటూ అన్నాడు మల్లన్న. మొగుడి బనీనుకి పడిన చిల్లులు చూసి సాయిలు మనసు విలవిల్లాడిపోయింది. దిక్కుమాలిన బతుకులు, కష్టపడి పనిచేసినా ఇంత తిండికీ కరువే, ఒంటి మీద బట్టకూ కరువే' మనసులోనే తిట్టుకుంది. 'ఆ ఒంటి మీద బన్నీను పూర్తిగా పీలికలైపోయింది. డబ్బులు సేతికందగానే ముందు ఓ పంచె, గావంచా, రెండు బన్నీనులు కొనుక్కో. ఆ తర్వాత మిగతా ఆటి గురించి ఆలోచిద్దువు'. 'మల్లన్న పెళ్లాం వైపు చూసి నవ్వుకున్నాడు. ఎప్పుడూ నా గురించి, పిల్లల గురించే సెబుతావుగాని నీ ఒంటిమీదైనా మంచి చీరా, రవికా ఉన్నాయా సెప్పు? ఆడదానివి, ముందు నీకు కొనాలా.. నేను కొనుక్కోవాలా?' పెళ్లాం వైపు చూస్తూ అన్నాడు మల్లన్న.
    'నాకేటిలే.. కట్టుకునేదొకటి, ఇప్పేసేది ఒకటి ఉంది చాలు. ఎప్పుడో పనికెళ్లినప్పుడు చీరలెక్కడైనా చిరుగులుంటే ఒల్లు సచ్చిపోద్దిగాని, నేకపోతే నాకివి సాలవా?' సాయిలు తలదించుకునే అంది. 'అది నీ మంచితనమే'. 'మన కట్టాలన్నీ తెలిసినవే కదా! దేవుడికే మనమీద దయలేనప్పుడు ఎవుల్ని ఏటనగలం? ఈ ఏడాదైనా పంట చేతికొస్తుందన్న ఆశతో ముందే ఇవన్నీ సెప్పాను. అంతేగాని నీ మనసు కట్టపెట్టాలని కాదు'. 'నువ్వేటి తప్పుమాటన్నావే అనుకోడానికి. నా మనసులో మాటే నీ నోటంట వచ్చింది. సరేలేగాని నాలుగు రోజుల్లో కోతుంది. కొడవల్లు తియ్యి. రేపు మంగలోరం సంతకెళ్లి పదునెట్టించుకుని వస్తాను' అని మొగుడు చెబుతూ బయటకు వెళ్లిపోతుంటే.. సాయమ్మ ఆవేదనతో మల్లన్న వైపు చూస్తూ నిల్చుండిపోయింది.
    బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫాన్‌గా మారిందన్న వార్తలు వినగానే మల్లన్న గుండె జారిపోయింది. రెండు రోజుల్లో పంట కోత ఉంది. తుఫాన్‌ హెచ్చరికతో బెంబేలెత్తుతున్నాడు. ఎండ తీక్షణంగా ఉండడంతో కొంత ఆశ ఉన్నా అనుభవాలు అతన్ని భయపెడుతున్నాయి. మొగుడి పరిస్థితి చూసి సాయిలు మనసు కూడా విలవిల్లాడిపోతోంది. 'అమ్మా పోలేరమ్మ తల్లీ! నువ్వే కాపాడమ్మా' అని
    ఊరి దేవతను పదేపదే మొక్కుకుంటోంది. 'ఏటి మల్లన్నా, తుఫానంటన్నారు, ఈ ఏడాదీ మన కష్టం నీటిపాలేనా?' అటుగా వెళ్తున్న నర్సింహులు నులకమంచంపై నడుం వాలుస్తున్న మల్లన్నతో అన్నాడు.
    'ఎర్రగా ఎండెక్కుతుంటే ఇక ఏ సమస్యా లేదనుకున్నాంరా. ఇప్పుడు తుఫాన్‌ అంటన్నారు. ఏం చేస్తాం, మన రోజులు అలాగుంటే' నర్సింహులికి చెబుతూనే నడుం వాల్చాడు మల్లన్న. వరుసగా మూడేళ్లు అనుభవాలు మనసులో మెదిలాయి. 'రెండేళ్ల క్రితం ఖరీఫ్‌ ప్రారంభానికే టంచన్‌గా వర్షాలు కురిసాయి. రైతులు ఆనందంగా వరి పంట వేసుకుంటే పొట్ట దశలో వర్షాలు ముఖం చాటేశాయి. తీక్షణంగా కాసిన ఎండలకు కళ్ల ముందే పంట ఎండిపోయింది. పదునులేక అపరాల పంట వేయలేకపోయారు. దమ్మిడీ ఆదాయం లేకపోగా విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం చేసిన అప్పులు మిగిలాయి. ఆ తర్వాత ఏడాది కరువు కమ్మేసింది. గత ఏడాది పంట చేతికి వచ్చిందంటే ధర లేదు. దళారులు రైతులు ఉసురు పోసుకున్నారు. అంతో ఇంతో చేతికి వచ్చినా సగం అప్పులు మిగిలాయి. ఇప్పుడు తుఫాన్‌ భయం వెంటాడుతోంది' ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు మల్లన్న.
    కాసేపటికి కారుమబ్బులు కమ్మేశాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతోంది. ఈదురు గాలులతో భారీ వర్షం జోరందుకుంది. వరిచేను గుర్తుకు వచ్చిన మల్లన్న నిద్ర లేచి పొలంవైపు పరుగందుకున్నాడు. ఊహించినట్టే అయిందని విలవిల్లాడిపోతున్నాడు. మట్టిమనుషుల మీద ప్రకృతికి ఎందుకంత కక్షని వాపోతూ పొలాన్ని చేరుకున్నాడు. వరద ముంచెత్తి ఉంది. గాలికి వరిచేను వాలిపోయి నీటిలో తేలుతోంది. కాళ్లకు ఏదో అడ్డం తగిలి మల్లన్న దబ్బున పడ్డాడు. మెలకువ వచ్చి ఉలిక్కిపడ్డాడు. ఆందోళనతో ఒళ్లంతా చెమట పట్టేసింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. బయట వాతావరణం మామూలుగానే ఉంది. భయంతో తాను భ్రమపడ్డాననుకున్నాడు. 'ఏం మల్లన్నా, దిగుబడి గురించి నాలాగే పగటి కలలు కంటున్నావా? అదుగో సూడు మళ్లీ మన పీక మీదికి వచ్చిపడుతోంది వర్షం' నిద్రలేచి మంచంపై కూర్చున్న మల్లన్నతో అప్పుడే అటుగా వచ్చిన సుగ్రీవులన్నాడు. సూరీడు పక్క పొలం సుగ్రీవులది. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు విసిగిపోయి 'వ్యవసాయం కంటే పట్నం పోయి తోపుడు బండిపై ఇన్ని పూలమ్ముకున్నా హాయిగా బతకొచ్చని!' అంటూ ఉంటాడు. 'ఇప్పడేదైనా అనుకోని ఉపద్రవం వస్తే ఊరిల సగం మంది రైతుల కష్టం నీటి పాలవుతుంది. ముఖం కడుక్కుని కాస్త టీ తాగి, పొలానికి వెళ్లి ఓసారి చూసి వచ్చాడు. చిరుజల్లులే కురుస్తుండడంతో ప్రమాదం తప్పుతుందని ఎక్కడో ఏదో చిన్న ఆశ. వర్షం కారణంగా ఆ రాత్రి ఇంట్లోనే నిద్రపోయాడు. అర్ధరాత్రి అయ్యేసరికి ఉరుములు, మెరుపుల అలజడితో కళ్లు తెరిచాడు. మంచంపై నుంచి లేచి బయటకు చూశాడు. అప్పటికే వర్షం జోరందుకుంది. గాలి కూడా ధాటిగా వీస్తోంది. అతనిలో భయం ప్రారంభమయ్యింది. 'అయిపోయింది. ఈ ఏడాది కూడా నాలుగు రూపాయలు కళ్లజూసే అదృష్టం లేనట్టుంది. ఏ అద్భుతమో జరిగితే తప్ప పంట దక్కదు' అనుకుంటూ దిగులుగా మంచంపై కూర్చున్నాడు. అతనికి దిక్కుతోచడం లేదు. వర్షం ఏకధాటిగా కురుస్తోంది. నోటికాడ కూడును ఎవరో లాగేస్తున్నట్టు అతని మనసు విలవిల్లాడిపోతోంది. ఎక్కడో, ఏదో మూలన ఉన్న చిన్న ఆశ ఆ క్షణం మాయమైపోయింది. భయం, ఆందోళన, ఆవేదన, కోపం, అక్రోసం.. ఇలా అన్నీ కలిపి ఒకేసారి వస్తే.. మనిషి పరిస్థితి ఎలా వుంటుందో ఇప్పుడు మల్లన్న పరిస్థితి అలాగే ఉంది. రెప్పలమాటున కన్నీటిని దాచుకుంటూ నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు.

                                                                     ***

'చూడు మల్లన్నా, ముందు ఏడాది అతివృష్టి. తర్వాత ఏడాది అనావృష్టి. ఏమీ అనలేకపోయాను. గత ఏడాది పంట చేతికందినా ధర లేక మూడోవంతు అప్పు కూడా తీర్చలేదు. నమ్మకమైన మనిషివి, నిజాయితీ ఉన్నోడివని పల్లెత్తు మాట అనలేదు. ఈ ఏడాది పంట బాగుండడంతో నా అప్పు కడతావని ఆశపడ్డా.. ఇప్పుడిలా అయ్యింది. ఇక నావల్ల కాదు. నేను మాత్రం ఇంట్లో సొమ్ము ఇచ్చానా? వ్యాపారం జరగాలని బ్యాంకుల్లో లక్షల్లో అప్పు చేసి, మీకు వేలల్లో ఇస్తున్నాను. నేనూరుకున్నట్టు బ్యాంకు వాళ్లు ఊరుకోరు కదా! టంచన్‌గా కట్టకపోతే నానా యాగీ చేస్తారు. నా పరిస్థితి కూడా అర్థంచేసుకో! భూమే అమ్ముతావో? తాకట్టే పెడతావో? నా అప్పు మాత్రం తీర్చాల్సిందే' ఉదయం ఇంటికి వచ్చిన మిల్లు షావుకారు స్పష్టంగా చెప్పేశాడు. అప్పిచ్చిన అందరి వద్దా అదే మాట. రెండురోజుల పాటు గాలివానల బీభత్సానికి వరిపంట మొత్తం ఒరిగిపోయింది. భారీ వర్షంతో గాలికి నేలకొరిగిన చేను నీటిలో తేలుతోంది. కాలువలోకి ఎంతలా నీరు మళ్లించినా, మొత్తం నీరు బయటకు వెళ్లాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అప్పటికి ధాన్యం రంగు మారిపోయి, మొలకలు కూడా వచ్చేస్తాయి. ఆ పరిస్థితి చూసే షావుకారు ఆ మాటన్నాడు. నీటిలో పంటను చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్న మల్లన్నకు షావుకారి మాటలే పదేపదే చెవుల్లో మారుమోగుతున్నాయి.
    'నన్ను క్షమించు సాయిలు. ఈ ఏడాది నీ కోరిక తీర్చలేకపోతున్నాను. ఈ ఏడాదే కాదు ఎప్పటికీ ఏమీ చేయలేనేమో! ఏడ్చిఏడ్చి అలసిపోయి కన్నీళ్లు కళ్లలోనే ఇంకిపోతున్నాయి. పేదోడికి ఆశలు ఉండకూడదే. వద్దు సాయిలు. ఈ భూమిని నమ్ముకుంటే ఇక మనం బాగుపడం. ఇక్కడ పడే కష్టం ఇంకెక్కడ పడినా ప్రశాంతంగా బతకొచ్చు'. పెళ్లానికి మనసులోనే క్షమాపణ చెప్పుకుని, పొలం నుంచి ఇంటికి బయలుదేరాడు మల్లన్న. ఇంటికి వెళుతూ ఏళ్లుగా తనకు అనుబంధం ఉన్న బూరుగు చెట్టువైపు ఓసారి చూశాడు. అప్పటికే చాలావరకు పక్షులు ఆ చెట్టును వదిలి వెళ్లిపోయాయి. ఉన్న నాలుగైదు జంట పక్షులు కూడా ఈ గాలివానకు ఎటో ఎగిరిపోయినట్టున్నాయి. పక్షుల జాడే కనిపించలేదు. 'పోనీలే, ఎన్నాళ్లున్నా ఆ పాము పీడ విరగడవ్వదు. ఇప్పుడు ఆకలితో నకనకలాడి మరో గత్యంతరం లేక సచ్చినట్టు ఆ పామే ఆ చెట్టును వదిలి వెళ్లిపోతుంది. ఆ మూగజీవాల జీవన పోరాటానికి పరిష్కారం దొరికింది. నాకూ అలాంటి పరిష్కారమే కావాలి' అనుకున్నాడు.
    మల్లన్నకు ఎప్పుడూ సుగ్రీవులు అన్న మాటలే గుర్తుకు వచ్చాయి. అప్పటికప్పుడు తానేం చేయాలో నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి రాగానే అతని మనసు కుదుటపడింది.

బి.వి.రమణమూర్తి
89855 27613