
దేవుళ్లూ దేవతలతో సంబంధం లేని అచ్చమైన ప్రకృతి పండగ ఉగాది. చుట్టూ ఉన్న చెట్టూ చేమా, సకల జీవులూ శీతకాలపు స్తబ్దత నుంచి బయటపడి, కొంగొత్త జీవనోత్సాహం పొందే తరుణం ఇది. అతి చల్లగాలుల ప్రతికూల కాలం జీవన ప్రక్రియలను నెమ్మదింపజేస్తే .. ఉన్న శక్తినే వాడుకొని చెట్లు తమ ఆకుపచ్చని కిరీటాలను శిశిరానికి పాదాక్రాంతం చేస్తాయి. ఆకులను రాల్చి రాల్చి, మోడువారుతనాన్ని శిరసున దాలుస్తాయి. కాలం ఏటెల్లకాలం ఒకేలా నడవదు. వెచ్చదనం, వెలుగుదనం ప్రకృతిలో మళ్లీ చైతన్యాన్ని రేకెత్తిస్తాయి. పండుటాకులు రాలిన చోటే లేత చివుళ్లు తళతళలాడతాయి. సుతారంగా తాకే చిరుగాలులకు పరవశించి పచ్చని పతాకాల్లా రెపరెపలాడతాయి. కోయిళ్లు లేలేత చివుళ్లను ముద్దాడి కూహూ కూహూ రాగాలను అందుకుంటాయి. గుత్తులు గుత్తులుగా మావిళ్లు ఊయళ్లూగుతాయి. పచ్చదనాన్ని త్యాగం చేసి, పాలపుంతలను సంతరించుకున్నట్టు వేపవనాలు వెలుగొందుతాయి. నిండా తీపిదనం పొటమరించిన ఉత్సాహంతో చెరుకు గడలు చవులూరిస్తాయి. పంటల ప్రసవ విరామం అనంతరం.. నేల మళ్లీ మొలకెత్తే సన్నాహాలకు సన్నద్ధమవుతుంది. అలాంటి ప్రకృతి పరవశపు నేపథ్యంలో ఉగాది పర్వదినం ఏతెంచుతుంది.

రైతు సంతోషమే నిజమైన ఉగాది
పరమార్థాలను పక్కన పెట్టి, పర్వదినాలను జరుపుకుంటే - వట్టి తంతు మాత్రమే అవుతుంది. ఇప్పటి రైతు పరిస్థితి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది కాదు. అంతా సవ్యంగా సాగిపోయే స్థితి లేదు. సాగునీరు, పెట్టుబడి, ఎరువులు, మందులు, వాటి ధరలూ, దిగుబడి, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వంటివన్నీ ఆధునిక కాలపు అవసరాలు. వీటిని పంచాంగం తీర్చదు, ప్రభుత్వమే పట్టించుకోవాలి. పట్టించుకునేలా ప్రభుత్వాలూ వ్యవహరించకపోవటం మరొక ధోరణి. రైతులను నిర్వాసితులను చేసి, పంటభూములను బడా కంపెనీలకు కట్టబెట్టడం ఇంకొక విపరీతం. వీటిని అర్థం చేసుకొని, అడగగలిగిన, అడ్డుకోగలిగిన చైతన్యం రైతుల్లో రావాలి! రైతు శ్రమించి, వడ్డిస్తున్న వరిధాన్యాలనే మనం భుజిస్తున్నాం కాబట్టి- మనందరం అన్నదాతలకు అండగా నిలవాలి. అప్పుడే రైతుకు నిజమైన ఉగాది. దేశానికి బలమైన పునాది.ఒకప్పుడు కొందరికే పరిమితమైన పంచాంగాలు నేడు టీవి ఛానెళ్ల ప్రభావంతో ఇంటింటా వినిపిస్తున్నాయి. ప్రకృతి కొన్ని సూత్రాల ఆధారంగా మనకు ఆచరణను నేర్పింది. అలాంటి జాగ్రత్తనూ ప్రదర్శించటం మంచిపని. మన పూర్వతరాల వారు తమ అనుకూలత, అవసరాల్లోంచి ఉగాది వంటి పండుగలను జరుపుకొంటే- మారిన పరిస్థితుల్లో మనం వాటినే మక్కీకి మక్కి అనుసరించటం అశాస్త్రీయం. ప్రకృతి పట్ల అవగాహన, ప్రకృతితో సమన్వయం, పర్యావరణ స్పృహ, ప్రకృతి ప్రత్యక్షంగా, పరోక్షంగా నేర్పే పాఠాలను అన్వయించుకోవటం- విజ్ఞత. ఆ పరిధిని, పరిమితిని గుర్తెరిగి, ఉగాదిని ఆస్వాదించాలి.
ఎంచి చూస్తే ప్రకృతి ఒక క్రమబద్ధమైన పాఠం. కార్యకారణ సంబంధాలను వివరించే కమ్మని కావ్యం. ఆటై పాటై మాటల మూటై సామూహిక చైతన్యానికి తలపులు తెరిచే ఒక సాంస్కృతిక ఉత్సవం. 'శిశిరం లాంటి చీకట్లొస్తాయి.. బాధిస్తాయి.. వేధిస్తాయి.. నిరాశ, నిస్పృహలను రగిలిస్తాయి. అయితే, అవి నిరంతరంగా ఉండిపోవు. ప్రతికూలతకు తలొంచకుండా ముందుకు సాగితే.. తలెత్తుకొని నిలవటానికి నిరంతరంగా కృషి చేస్తే.. మళ్లీ కొత్తదనం సంతరించుకుంటాం. పచ్చదనమై పరవళ్లు తొక్కుతాం. కొత్త స్వరమై మార్మోగుతాం.' అని చెప్పకనే చెబుతోంది ప్రకృతి. మొక్కవోని ఆశావాదం, చెక్కు చెదరని దీక్షాపథమే నిత్యనూతన జాగృతి.
పున:ప్రారంభానికి పునాది ఉగాది. మజిలీ మజిలీలుగా సాగే జీవన ప్రస్థానంలో విరామం తరువాత వేసే తొలి అడుగు ఇది. మనిషి పూర్తిగా ప్రకృతి ఆధారంగా బతికిన కాలంలో ఇది చాలా ప్రాధాన్యం ఉన్న పండగ. వ్యవసాయమే ప్రధాన వ్యాపకంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఓ కాలమానం ఈ పర్వదినం. భూముల కౌలు ఒప్పందాలు, వివిధ వ్యవసాయ సహాయక వృత్తుల వారి ప్రతిఫల నిర్ణయాలూ కొత్తామావాస్యతో ముగిసి, ఉగాదితో ప్రారంభమవుతాయి. ఏరువాక పనులు ఉగాదితోనే మొదలవుతాయి. వ్యాపారులు కొందరు ఈ సందర్భంగానే కొత్త పద్దు పుస్తకాలు ప్రారంభిస్తారు. వ్యవసాయ, వ్యాపార వ్యవహారాల్లో ఆధునిక కాలం అనేక మార్పులు తెచ్చినా.. ఈ పనుల్లోని ఆరంభపు సంరంభం ఏదొక రూపంలో ఇంకా కొనసాగుతూనే ఉంది.

పచ్చడి సేవనం.. పంచాంగ శ్రవణం..
ఉగాది రోజున ఆరు రుచులూ, దినుసులూ కలగలిపిన పచ్చడిని తినటం ఒక ఆనవాయితీ. చెరకు రసపు తీపి, మామిడికాయ వగరు, చింతపండు పులుపు, వేపపువ్వు చేదూ, ఇంటన ఉండే ఉప్పూ, కారం.. వీటన్నింటికీ అరటిపండు గుజ్జూ.. సరైన పాళ్లలో కలిస్తే ఉగాది పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి ఆధారంగా జీవిత పాఠాలూ, ఆరోగ్యసూత్రాలూ అన్వయించటం ఒక తతంగంగా ప్రతి ఏటా జరుగుతూనే ఉంటుంది. తరువాతి ముఖ్యకార్యక్రమం పంచాంగ పఠనం లేదా పంచాంగ శ్రవణం. రాబోయే కాలంలో జరగబోయే పరిణామాల మీద ఊహాగానం ఇది. మొత్తంగా దేశానికి, విడివిడిగా వ్యక్తులకు ఈ ఏడాది ఎలా ఉంటుందో పంచాంగకర్తలు విడమరిచి వివరిస్తారు. రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం... ఎవరికి ఎన్నెన్ని పాళ్లో వివరించటం ఒక తంతు. కమ్యూనిస్టులు తప్ప దాదాపు అన్ని పార్టీల వాళ్లూ తమ ప్రధాన కార్యాలయాల్లో పంచాంగ పఠనం జరిపించటం సర్వసాధారణమైంది. ఏ రోటి దగ్గర ఆ పాట అన్నట్టుగా ఈ వ్యవహారం సాగుతోంది. ఈ ఏడాది అంతా దివ్యంగా ఉందని, విజయ పరంపర సాగిస్తారని పార్టీల వారీ పంచాంగాలు ఘనంగా ఘోషిస్తాయి. 'ఉదర పోషణార్థం బహువిధ భాషణం' పంచాంగకర్తల తంతైతే.. 'స్వీయానంద రీత్యా పంచాంగ పఠనం' ఆయా పార్టీల రీతి! నిజానికి పార్టీల, నాయకుల భవిష్యత్తుని నిర్ణయించేది పంచాంగాలు కాదు; ప్రజలు. ఇది అందరికీ తెలిసిన సంగతే అయినా.. ఈ ప్రహసనం సాగుతూనే ఉంటుంది.
పంచాంగం ఎంతవరకూ నిజం ?
రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులు, సామాన్య ప్రజలూ సహజంగా చేతిలోని శ్రమను తప్ప - పంచాంగ ప్రహసనాలను 'నమ్మకం'గా తీసుకోరు. ఈ మధ్య కొందరు పంచాంగాలూ, జాతకాలూ, హస్త సాముద్రికాలు వంటివి కూడా సైన్సేనని, మన పూర్వులు ఎంతో విజ్ఞానులని, వాటిని విస్మరించటం చాలా తప్పని వాదిస్తున్నారు. ఈ చాదస్తమే భారతీయుల ఔన్నత్యం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. పంచాంగకర్తలు చేస్తున్న కాలగణన, గ్రహణాల సమాచారం కచ్చితత్వాన్ని కలిగి ఉండడం చాలా గొప్ప విషయం కదా అని ఉదహరిస్తున్నారు. వారు చెబుతున్న దానిలో కొంత వాస్తవం ఉంది. ఖగోళ పరిశీలన, కాలగణన వంటి విషయాల్లో ఆర్యభట్ట వంటి మన పూర్వులు గొప్ప కృషి చేసిన సంగతి నిజమే! మనదేశంలోనే కాదు; చాలా ప్రాచీన సమాజాల్లో ఇలాంటి ప్రకృతి పరిశీలన, పరిశోధనలు, నిర్ధారణలు చాలా జరిగాయి. గ్రీకులు, చైనీయులు, భారతీయులు ఈ విషయాల్లో చాలా గర్వించదగిన కృషి చేశారు. రాత్రీ పగలూ ఏర్పడడం; వర్షాలు, చలిగాలులూ, ఎండలు ఒక క్రమపద్ధతిలో వచ్చి వెళ్లడం.. వంటి ప్రాకృతిక విషయాలను ఏళ్ల తరబడి నిశితంగా పరిశీలించారు. ఆ క్రమంలో దాగి ఉన్న సూత్రాలను వెలికితీశారు. రకరకాల గమనింపులు, గణింపులూ తరువాత కొన్ని నిర్ధారణలు చేశారు. అవే శాశ్వతం, స్థిరం అని కూడా వారు అనుకోలేదు. అనేకనేకమంది, అనేకనేక పరిశీలనలూ, వాదనలూ, చర్చోపచర్చలూ చేశాక.. నిరూపణలూ నిర్ధారణలూ జరిగాక - ఒక అభిప్రాయానికి వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒకటికి మించిన అభిప్రాయాలు కూడా ప్రచారంలో, ఆచరణలో మిగిలాయి కూడా! కొన్ని ప్రాంతాల వారీగా బలపడి, నిలబడ్డాయి. ఇదంతా విజ్ఞానం, శాస్త్ర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందటానికి ముందు జరిగిన సంగతి! ఒకానొక కాలంలో అప్పటికి అందుబాట్లో ఉన్న సాంకేతిక సామగ్రిని ఉపయోగించుకొని, కొంత నిర్ధారించుకొని, కొంత ఊహించుకొని చేసిన గణనలూ, గ్రహింపులూ ఇప్పటికీ మన పంచాంగాల్లో యథాతథంగా స్థిరపడిపోయాయి. అందుకనే గ్రహాలు తొమ్మిదికే పరిమితమయ్యాయి. దానిలో ఆధునిక శాస్త్రం ఉపగ్రహంగా నిర్ధారించిన చంద్రుడూ ఉన్నాడు. అసలు ఉనికే లేని రాహు, కేతువులనూ గ్రహాలుగా పేర్కొన్నారు. కాకపోతే అవి ఛాయాగ్రహాలని ఆధునిక పంచాంగ సమర్థకులు వల్లె వేస్తున్నారు. అసలు అనేది లేకుండా నీడ ఎక్కడి నుంచి వస్తుంది? నీడ పడడమే గ్రహణం అని చెప్పటం వరకూ సరైన నిర్ధారణే. కానీ, ఆ నీడ ఎక్కడిది? చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమిది. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడిది. ఇది ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్పిన సత్యం..

'పాత' మోత .. శాస్త్రజ్ఞులకు అవమానకరం
ఆర్యభట్టు, వరాహ మిహిరుడు వంటి మన పూర్వులు పరిశోధకులు, శాస్త్రజ్ఞులు. వారికి ఆ కాలంలో అందిన, అర్థమైన సమాచారం మేరకు ఖగోళ నిర్ధారణలు చేశారు. అది శాస్త్ర పద్ధతి. పరిశీలనలో, పరిశోధనలో కొత్త అంశాలూ కొత్త లెక్కలూ తోడయ్యేకొద్దీ - తమ అంచనాలను, నిర్ధారణలను మార్చుకున్నారు. తొలుత తెలిసిన దానినే పట్టుకొని వేళ్లాడలేదు. తరువాతి తరాల విజ్ఞానవేత్తలు ఆ పునాదుల మీదనే మరింత పరిశోధన సాగించారు. కొత్త విషయాలను కనుగొన్నారు. ఆ ప్రకారం గ్రహణాలు ఏర్పడటానికి రాహుకేతువులు కారణం కాదు. భూమ్మీద ఉన్న మనిషి జీవితాన్ని కొన్ని లక్షల మైళ్ల దూరంలో ఉన్న గ్రహాలు ఏమాత్రమూ ప్రభావాన్ని చూపించలేవు. శాస్త్రీయమైన కొలమానాలతో తాజాగా కనుగొన్నదే తుది నిర్ధారణ అవుతుంది. ఆర్యభట్ట, వరాహ మిహిరుడు వంటి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఉండివుంటే- ఈ శాస్త్రపద్ధతినే సమర్ధిస్తారు, అనుసరిస్తారు. కానీ, శాస్త్రంలో మూఢత్వాన్ని కలగలిపిన వారు, గతమే ఘనమని భ్రమసేవారు సైన్సుని అవహేళన చేస్తారు. ఖగోళ పరిశోధన ఓ పదీ, పన్నెండు శతాబ్దాల కిందనే ఆగిపోయిందని అనుకునేవాళ్లే పంచాంగాన్ని వెనకేసుకొస్తారు. ఆ తరహా తీరు ఆధునిక సైన్సును తక్కువ చేయటమే కాదు; మన ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుల వైజ్ఞానిక పరంపరను అవమానించటం కూడా !

భిన్న సంస్క ృతుల సమ్మేళనం
తెలుగు సంవత్సరాది గొప్పది.. ఆంగ్ల సంవత్సరాది మనకు అవసరం లేనిది అని గుంపు ప్రచారం కూడా ఒకటి జరుగుతూ ఉంది. వాట్సాపుల్లో దానిని చూసి, మరికొంతమంది మోసి సంబర పడే చాదస్తం నడుస్తూ ఉంది. నిజానికి జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ ఒక సంవత్సరం అన్న కాలమానం ప్రపంచం మొత్తంతో మనల్ని అనుసంధానిస్తుంది. ఆ పద్ధతిలోనే మన మొబైళ్లూ, వాట్సాపులూ పనిచేస్తున్నాయి. ఆ కాలమానం నుంచి వైదొలగితే- చాదస్త ప్రచారం చేసే వాట్సాపు కూడా అందుబాట్లో లేకుండా పోతుంది. మన పండగలను మనం అభిమానించాలి.. ఆస్వాదించాలి. కానీ, అనుకూలత, అవసరత ఎక్కడిదైనా స్వీకరించాలి. విశాల ప్రపంచంలో ఉన్న మనం.. మనల్ని మనం కుదించుకోకూడదు. విస్తరించాలి.. విశాలంగా ఆలోచించాలి. ఈ ఏడాది ఉగాది ఎప్పుడంటే ఏమని చెబుతాం? చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అంటే అర్థం అవుతుందా? ఏప్రిల్ రెండో తేదీన అంటే సులభంగా కళ్లకు కడుతుంది. చాదస్తం కాదు, సౌలభ్యమే మనకు ముఖ్యం.
నిజానికి ఈ ఉగాది కూడా దేశం మొత్తానికి ఒకటిగా లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంవత్సరాది ఉంది. మన రాష్ట్రంలోనే గిరిజన ప్రాంతాల్లో ఉగాది సంవత్సరాది కాదు. సంక్రాంతి తరువాత వచ్చే కందికొత్తలు ఆదివాసీలకు కొత్త సంవత్సరం. మరాఠీల కొత్త సంవత్సరం గుడి పడ్వాడా. తమిళుల పండగ పుత్తాండు. మలయాళీల కొత్త ఏడాది విషు. సిక్కులది వైశాఖి. బెంగాలీల సంవత్సరం పొరులా బైశాఖ్‌తో మొదలవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఉగాదికి ఏ సందడీ ఉండదు. వారి తొలి పండగలు వారికి ఉన్నాయి. ఈ పండగలన్నీ ఒకేలా జరగవు. ఆచార వ్యవహారాల్లో, ఆరాధ్య పద్ధతుల్లో ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. అదే మన దేశంలోని సాంస్క ృతిక వైవిధ్యం. ఒక పండగనో, సంస్క ృతినో ప్రథమస్థానంలోకి తెచ్చి.. దీనినే మనం అనుసరించాలి అని అనటం తప్పు. అది మాత్రమే మన సంస్క ృతి అనటమూ సమంజసం కాదు. భారతదేశ సౌందర్యం భిన్నత్వంలోనే ఉంది. ఆ భిన్నత్వాన్ని గౌరవించే, అనుసరించే ఏకత్వంలో ఉంది.
మన రాష్ట్రంలో ఉన్న పంచాంగాలన్నీ ఒకేలా ఉంటాయా? ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. నేమాని, పిడపర్తి, ములుగు.. ఇలా సిద్ధాంతులు మారేకొద్దీ కాలగణనాలూ, వ్యాఖ్యానాలూ మారతాయి. ఎవరి అవగాహన వారిది. దక్షిణాది పంచాంగానికి చాంద్రమానం ఆధారమైతే- ఉత్తరాదికి సౌరమానం మూలం. ఒక్కోసారి ఓ పండగని ఏ రోజున జరపాలి అన్నదాని మీద ఇద్దరు పంచాంగకర్తల మధ్య ఏకాభిప్రాయం కుదిరి చావదు. ఎవరి వాదనలు వారికి బలంగా ఉంటాయి. ఇక్కడ కూడా పండగలోని ఆనందం ముఖ్యం తప్ప అనవసర వాదనలు కాదు. సాధారణంగా సామాన్యులు, శ్రమజీవులు ఈ చాదస్తాలను పట్టించుకోరు.

మన భవిష్యత్తు పంచాంగాల్లో లేదు
మనం మనుషులం సంఘజీవులం. మన జాతకాలు, భవిష్యత్తులూ విడివిడిగా ఉండవు. పుట్టిన నక్షత్న్రాన్ని బట్టో, నామధేయాన్ని బట్టో ఉండవు. పంచాంగాల్లో అసలే ఉండవు. మరి ఎక్కడ ఉంటాయి? మనం ఎన్నుకున్న ప్రభుత్వాల్లో, వాటి విధానాల్లో ఉంటాయి. మనచుట్టూ ఉన్న ప్రపంచంలో ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే మన తీరుతెన్నుల్లో ఉంటాయి.
విశాఖ స్టీలుప్లాంటు భవిష్యత్తు పంచాంగంలో ఉండదు. మోడీ ప్రభుత్వం చేతల్లో ఉంది. దానికి వ్యతిరేకంగా పోరాడే కార్మికుల చేతుల్లో ఉంది. ప్రయివేటీకరించటమే కేంద్ర ప్రభుత్వ పాటా, బాటా అయితే- అది కార్మికులకు, రాష్ట్ర ప్రజలకు చేదు అవుతుంది. టాటాకో, అంబానీ అదానీలకో తీపి అవుతుంది. ఇక్కడ కార్మికుల రాజ్యపూజ్యాలూ అవమానాలూ విడివిడిగా లేవు. అందరిదీ ఒకటే భవిష్యత్తు. ప్లాంటును ప్రయివేటుపరం కాకుండా పోరాడ్డం ఒక్కటే వారందరి ఏకైక మార్గం. ప్రజలు బాగుండాలంటే అడ్డదారిన నడిచే ప్రభుత్వాలకు బుద్ధొచ్చేలా చేదు, కారం రుచి చూపించాలి. కార్పొరేట్లకు తీపి ఫలాలను కట్టబెట్టే వారి కుట్రలను ఎండగట్టాలి. సాగు చట్టాలపై రైతుల సుదీర్ఘ పోరాటంలో అలాంటి ఐక్యతను, అలసట ఎరగని ధీరత్వాన్ని మనం చూశాం. అలాంటి సంఘటిత, సమరశీల పోరాటాలే ఇప్పుడు సామాన్యులను ఐక్యం చేస్తాయి. ఎదురులేదని విర్రవీగే వారికి గుణపాఠం చెబుతాయి.
ప్రతికూల వాతావరణం చుట్టుముట్టినప్పుడు- ఆకులన్నీ రాలిపోయినా ప్రతిఘటించి, ఎదిగే లక్షణాన్ని తనలో సజీవంగా నిలుపుకొంటోంది హరిత ప్రకృతి. బయటికి మోడువారినట్టు కనిపించినా సమయం ఆసన్నమైనప్పుడు- చివుర్లు చివుర్లుగా మెలకలెత్తి పచ్చదనంతో ప్రకాశిస్తోంది. ఓ చెట్టో మొక్కో, వనమో గడ్డి పరకో అలా తలెత్తుతున్నప్పుడు మనుషులం మాత్రం చిగురించలేమా? సంఘటితమై సమూహమై చైతన్యమై ప్రవహించలేమా? అదిగదిగో.. ప్రవహించగలమని ఉద్ఘోషిస్తోంది ఉగాది వికాస గీతం..!

సంకుచితాలూ .. చాదస్తాలూ ...
క్రీస్తు శకం కాదు, శాలివాహన శకం అనాలి అంటాడు ఒక దక్షిణాది చాదస్తుడు. సదరు ఛాందసుడి సోదరుడొకడు ఉత్తరాదిలో ఇదే పాట పాడతాడు. క్రీస్తు శకం వద్దనటం వరకూ సేమ్ టూ సేమ్. మరి ఏం కావాలీ అంటే- విక్రమాదిత్య శకం అంటాడు. ఈ ఇద్దరినీ ప్రేరేపించేదీ, ఇద్దరికీ క్రీస్తు శక విద్వేషాన్ని నూరిపోసేదీ ఒక తానును చించుకున్న మతతత్వ సంస్థలే! కానీ, ఏ శకం ఉండాలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరదు. ఈ స్థానిక శకాలు తెలుగు పంచాంగాల్లో చాలా కాలంగా పదిలంగా ఉన్నాయి. ఉంటాయి కూడా. కానీ, వాటిని అధికారికంగా పరిగణనలోకి తీసుకోలేం. ఎందుకంటే ప్రపంచం మొత్తం అనుసంధానించబడ్డ క్యాలెండరులో అది భాగం కాదు కాబట్టి. ఇలా చాదస్తంగా, విద్వేషంగా మాట్లాడేవాళ్లు వారి పుట్టిన తేదీ గురించి చెప్పాల్సి వస్తే- క్రీస్తు శకం క్యాలెండర్‌ని అనుసరించాల్సిందే! శార్వరి నామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష నవమి అంటే- విన్నవారికే కాదు; చెప్పినవారికీ అర్థం కాదు. తెలుగు సంవత్సరాలకు మనవాళ్లు ముందే ఊహించి గొప్ప పేర్లు పెట్టారు.. ఫలానా సంవత్సరంలో జబ్బులు వస్తాయి, ఫలానా సంవత్సరంలో నేరాలు పెరుగుతాయి, ఫలానా సంవత్సరంలో పడవ ఎక్కి ప్రమాదాల ఏరు దాటేస్తాం అని చెప్పుకోవటం పరమ మూర్ఖత్వం. సంవత్సరాల పేర్లకే అంత శక్తి ఉంటే- ఇంక ఈ ప్రస్థానం దేనికి? మనుషులను నిర్వీర్యపరిచే ఇలాంటి నిరాశవాదపు డాంబికాలను ఎక్కడికక్కడ ఖండించాలి. మనిషి ఆచరణనూ, విజ్ఞతనూ కించపరిచే సోషల్ మీడియాలోని మూఢత్వ ప్రచారాలను ఆలోచనాపరులు చీత్కరించాలి.
- సత్యాజీ
9490099167