- కునుకు లేని రైతన్న - తెరిపివ్వని వానలు - తడిసి ముద్దయిన ధాన్యం
- ఏటా తప్పని నష్టాలు - భరోసా కల్పించలేకపోతున్న ప్రభుత్వం
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
గత నాలుగు రోజులగా ఓ వైపు అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర చేస్తుంటే కళ్లాల వద్దే రేయింబవళ్లు పండించిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు కునుకు లేక రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. మరో వైపు వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బుధవారం కూడా జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. పలు మండలాల్లో నేలను తాకిన వరిచేల నుంచి, తడిసి ముద్దయిన ధాన్యం రాశుల నుంచి మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. దీంతో ఎప్పుడు తెరుపు ఇస్తే అప్పుడు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు పలువురు రైతులు కంటిమీద కునుకు లేకుండా రేయింబవళ్లు కళ్లాల్లోని రాశుల వద్దే కాపలాగా ఉంటున్నారు. బరకాల అద్దెలు తడిసి మోపెడవుతుంటే అదనపు భారం మోస్తున్నారు. మరోవైపు నేలను తాకిన వరి కంకులను పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్నా మోకాలి లోతు నీటిలో వీలు పడడం లేదు. దాంతో చేసేదేమీ లేక కళ్లదుటే చేతికి అంది వచ్చిన పంటను పలువురు అలానే వదిలేశారు. కొందరు కళ్లాల్లోకి చేరిన నీరును బయటకు తీసేందుకు వ్యయప్రయాసలు పడుతున్నారు.
అంచనాల్లో వ్యవసాయ శాఖ
కాకినాడ జిల్లాలో 20 మండలాల్లో 123 గ్రామాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఎక్కువగా పిఠాపురం మండలంలో 16 గ్రామాలు, కరపలో 14, కాజులూరులో 14, కాకినాడ రూరల్ లో 13, పెదపూడిలో 9, కిర్లంపూడిలో 8, తాళ్లరేవులో 7, ప్రత్తిపాడులో 6, సామర్లకోటలో 6, పెద్దాపురంలో 5, గొల్లప్రోలులో 5, శంఖవరంలో 4, న్యూ కొత్తపల్లిలో 3, తొండంగిలో 3, తుని తొండంగి ఏలేశ్వరం గ్రామాల్లో రెండేసి, గండేపల్లి, కోటనందూరు మండలాల్లో ఒక్కో గ్రామంలో వర్షం ప్రభావంతో నష్టం జరిగినట్లు అంచనాకు వచ్చారు. 1.63 లక్షల ఎకరాల్లో రబీలో వరి సాగవ్వగా 80 వేల ఎకరాల్లో కోతలు పూర్త య్యాయి. ప్రధానంగా ఆరు మండలాల్లో సుమారు 6 వేల ఎకరాల్లో కోయని వరి నేలను తాకినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. సుమారు 7 వేల ఎకరాల్లో వరి పనలపై ఉంది. 7 వేల ఎకరాల్లో సుమారుగా 21 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లోనే ఉండ ిపోయింది.
నిబంధనలతో రైతు తలమునకలు
ప్రభుత్వం ధాన్యం కొనుగోలులోనూ, ప్రకతి వైపరీత్యాలలో నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించడంలో, నష్టం అంచనాలను రూపొందించడంలో పలు నిబంధనలను విధించడంతో రైతులు తలమునకలవుతున్నారు. జిల్లాలో వేలాది మంది రైతులు నష్టపోగా కేవలం పొలంలో నేలకొరిగిన పంటకు మాత్రమే పరిహారాన్ని అంచనా వేసి ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. పలుచోట్ల ధాన్యం కళ్లాల్లో తడిచి మొలకలు వస్తున్న వాటికి నష్టపరిహారం ఇవ్వమని, కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే ధాన్యాన్ని కొంటామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నూకల శాతాన్ని ఎక్కువగా చూపి మిల్లర్లు సొమ్ముతో కోత విధిస్తున్నారని పలువురు రైతులు తెలిపారు.
పొంచివున్న మరో గండం
ఈ నెల 6 తర్వాత బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు. 8వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవ కాశం ఉందని క్రమంగా బలపడి తుపానుగా మారుతుందన్న సూచనలతో పంటను ఎలా కాపాడుకోవాలని అయోమయంలో పడ్డారు.
ధాన్యం నుంచి మొలకలు వస్తున్నాయి
ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టి 20 ఎకరాలు కౌలుకి తీసుకుని బొండాలు రకం ధాన్యాన్ని సాగు చేశాను. ఈసారి దిగుబడి ఆశాజనకంగానే వస్తుంది. 8 ఎకరాలు కోత కోసి దాన్యం రాశిగా ఉంచాను. మొత్తం తడిసి మొలకలు వస్తోంది. ఎకరాకు 20 బస్తాలు చొప్పున నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలి.
జంపన కష్ణంరాజు, కౌలు రైతు, కోలంక, కాజలూరు మండలం
తడిసి ముద్దయిన ధాన్యాన్ని బయటకు తెస్తున్న రైతులు.. వర్షంలో ధాన్యం రాసులపై బరకాలు కప్పుతున్న రైతులు










