
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : ప్రకాశం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ సైదా డిమాండ్ చేశారు. యర్రగొండ పాలెంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు యర్రగొండ పాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు ఆదుకోవాలన్ని ప్రభుత్వం కనీసం ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదని తెలిపారు. వెంటనే ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, దుగ్గెంపూడి సుబ్బారెడ్డి, రువ్వల శ్రీను, షేక్ రిహానా బాను, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.