
ప్రజాశక్తి - కురుపాం : కురుపాం నుండి మాదిలింగి వెళ్లే ప్రధాన రహదారి వద్ద శుక్రవారం సాయంత్రం ఏడు ఏనుగుల గుంపు సంచారిస్తోందని, పరిసర ప్రాంతాల ప్రజలు, వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగుల గుంపు సమీప పంట పొలాలను, చెరుకు,అరటి తోటల్లో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ గ్రామాల రైతులు మాట్లాడుతూ వ్యవసాయ పనులు చేస్తూ పంటలను సాగు చేసుకుంటున్న నిత్యం పొలాల్లో ఉండి జీవనం సాగిస్తుంటామని, ఇలాంటి పరిస్థితుల్లో ఏనుగుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఏనుగులను దూర ప్రాంతాలకు తరలించి మా పంటలను మా ప్రాణాలను కాపాడాలని కోరారు.
కాజీ పేట సమీపంలో ఏనుగులు గుంపు
భామిని : మండలంలోని నల్లారాయిగూడ పంచాయతీ పరిధిలో గల సన్నాయిగూడ, ఇసుకగూడ పరిసర ప్రాంతంలో తిష్ట వేసిన నాలుగు ఏనుగుల గుంపు శుక్రవారం తెల్లవారుజామున భామిని పరిసరాల్లో మూలగూడ, కాజీపేట పరిసర గిరిజన ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ రెండు గ్రామాలు పరిసర ప్రాంతాల్లో పత్తి ఎపుగా పెరిగి, ఏరడానికి సిద్ధంగా ఉంది. ప్రతి రోజు ఈ గ్రామాల నుండి మహిళలు పత్తి ఎరడానికి పొలాలకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఏనుగులు దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు.