May 17,2023 22:22

ప్రజలతో మాట్లాడుతున్న పోలీసు అధికారులు

- గ్రామాల్లో పోలీసులు అవగాహన సదస్సులు
ప్రజాశక్తి - జగ్గంపేట రూరల్‌
జిల్లా ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ ఐపిఎస్‌ ఆదేశాల మేరకు మండలంలోని కాండ్రేగుల, గోళ్ళలగుంట గ్రామాల్లో జగ్గంపేట సిఐ బి.సూర్య అప్పారావు ఆధ్వర్యంలో జగ్గంపేట ఎస్‌ఐ విద్యాసాగర్‌ గ్రామ ప్రజలకు బుధవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సూర్య అప్పారావు మాట్లాడుతూ తాగి మోటార్‌ సైకిల్‌ నడపకూడదని, ప్రతి ఒక్కరికి లైసెన్స్‌ కలిగి ఉండాలని అదేవిదంగా వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి సమయంలో ఆరు బయట లేదా మేడపైన నిద్రించేవారు ఇళ్లకు తాళాలు పటిష్టంగా వేసుకోవాలని, విలువైన వస్తువులు ఒంటిపై ధరించరాదన్నారు. ముఖ్యంగా వేసవి సెలవులకు, వివాహాది శుభకార్యాలకు ఇల్లు విడిచి కుటుంబ సమేతంగా వెళ్లేవారు ముందుగా జగ్గంపేట స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా విలువైన వస్తువులు ఉంటే వాటిని బ్యాంకులో లాకర్స్‌లో భద్రపరుచుకోవాలని కోరారు. ముఖ్యంగా కాలనీలో నిషేధిత పదార్థాలైన గంజాయి, సారా అమ్మకాలు తయారీ వంటి వాటికి పాల్పడితే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామస్తుల్లో నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు మొత్తం ఐదుగురితో పీస్‌ కమిటీ ఏర్పాటు చేశారు. వీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. జగ్గంపేట ఎస్‌ఐ సిహెచ్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ ఎవరైనా సారా అమ్మినా, తయారుచేసినా చట్టరీత్యా నేరం అని అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే నాకు సమాచారం ఇవ్వాలని, మీకు ఏ సమస్య అయినా ఉంటే మీకు అందుబాటులో మహిళా పోలీస్‌ ఉంటారని వాళ్లకు తెలియచేయాలని సూచించారు.