రాజంపేట అర్బన్ : రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన వైసిపి నాలుగేళ్లల్లో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపి షాక్ ఇస్తున్నారని, ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యలను తిప్పికొట్టాలని సిపిఐ, సిపిఎం నాయకులు పిలునునిచ్చారు. ఆదివారం ఎఐటియుసి కార్యాలయంలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ఛార్జీల భారంపై ప్రచురించిన కరపత్రాలను వారు విడుదలచేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. మహేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి. రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నాలుగేళ్లల్లో ప్రజలనే అనేక భారాలు మోపిందని చెప్పారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కి అవుతున్నారని వాపోయారు. విద్యుత్ సంస్థలను కార్పొరేట్ రంగాల వారికి అప్పజెప్పేందుకే ఇలాంటి చర్యలు ప్పాడుతున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు తీసుకొని వస్తే ప్రతి పక్షంలో ఉన్న వై.ఎస్? రాజశేఖర్ రెడ్డి తన ఎమ్మెల్యేలను అందరిని కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో నిరాహార దీక్ష చేసి వామపక్ష పార్టీలు బషీర్‌బాగ్ ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమా, కార్పొరేటర్ల ప్రభుత్వమా అని ప్రశ్నించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు రూ. 30 వేలు పెట్టి స్మార్ట్ మీటర్లు బిగించాల్సిన అవసరం ఏముందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలతో సంక్షేమ పథకాలు కూడా తీసివేయడానికి కుట్ర చేస్తున్నారని, ఇప్పటికీ అనేకమంది పథకాలకు దూరమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీలు చేస్తున్న పోరాటాలకు అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు కలిసి వచ్చి పెంచిన విద్యుత్ ఛార్జీలు, పలు రకాల ఛార్జీలను ఉపసంహరించుకునేంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శివరామకష్ణదేవరా, నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎమ్మెస్ రాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కాటంశెట్టి వెంకటయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి సికిందర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ పాల్గొన్నారు.










