ప్రజాశక్తి-కాకినాడ ప్రజలపై పెద్ద ఎత్తున మోపుతున్న విద్యుత్ ఛార్జీల భారాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య భవన్‌లో కె.సత్తిరాజు అధ్యక్షతన నిర్వహించిన సిపిఎం పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు వినియోగించిన విద్యుత్‌పై ఛార్జీల కంటే, ఇడి ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, సర్ ఛార్జీలు, ఎఫ్‌పిపిసిఎ ఛార్జీలు, ఎఫ్ పిపిసిఎ 2 ఛార్జీల పేరుతో భారాలు వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టం ప్రకారం మోడీ ప్రభుత్వ షరతులకు లోబడి స్మార్ట్ మీటర్లు తెస్తున్నారని, అందుకయ్యే ఖర్చు కూడా వినియోగదారులపై వేయడానికి రంగం సిద్ధం చేసారని తెలిపారు. మొబైల్ వలే ఇకనుంచి విద్యుత్ మీటర్ కూడా ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం భారాలు వేయడం చాలా దారుణమన్నారు. సంక్షేమం గురించి గొప్పలు చెబుతున్న పాలకులు ప్రజలపై వివిధ రూపాల్లో భారాలు ఎందుకు వేస్తున్నారో చెప్పాలన్నారు. విద్యుత్ చార్జీల భారాలకు నిరసనగా వామపక్షాలు చేపడుతున్న ఉద్యమాలకు ప్రజలు భాగస్వాములు కావాలని ఎవి నాగేశ్వరరావు కోరారు. సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జి మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల హడావుడి ప్రారంభించారని, ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
సిపిఎం నగర కమిటీ ఏర్పాటు
సిపిఎం కాకినాడ నగర నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సిపిఎం నగర కన్వీనర్‌గా పలివెల వీరబాబు, సభ్యులుగా కె.సత్తిరాజు, మలకా వెంకట రమణ, డి.ప్రసాద్, కె.సత్తిబాబు, కె.నాగజ్యోతి, వేణు తదితరులు ఉన్నారు. ఈ సమావేశంలో రాజా, సత్యనారాయణ రాజు, వెంకట్రావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.










