ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజలపై వివిధ రూపాల్లో వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని, ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని సిపిఎం ఆధ్వర్యాన నిర్వహిరంచిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అన్నారు. శనివారం సుందరయ్య భవన్‌లో కె.సత్తిరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆర్‌పిఐ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, టిడిపి నాయకులు తుమ్మల రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకుడు టి.రాజా తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ట్రూఅప్ ఛార్జీలు, ఇడి ఛార్జీలు, సర్ ఛార్జీల రూపంలో అనేక విధాలుగా ప్రజలపై భారాలు వేస్తోందన్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని భారాలు వేయడం సమంజసంగా లేదన్నారు. మరోపక్క కేంద్ర బిజెపి పాలకులు తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా బిజెపి పాలిత రాష్ట్రాల కంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్మార్ట్ మీటర్లకయ్యే రూ.వేల ఖర్చు వినియోగదారులపై వాయిదాల పద్ధతిలో విద్యుత్ బిల్లులో వేయబోతున్నారని పేర్కొన్నారు. ఒక పక్క సంక్షేమ ప్రభుత్వం అని ప్రగల్భాలు పలుకుతూ మరోప్రక్క భారాలు వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జూన్ 30న విద్యుత్ కార్యాలయాల వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని సిపిఎం నాయకులు పలివెల వీరబాబు కోరారు. ఈ సమావేశంలో మలక వెంకట రమణ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకట రమణ, శివ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.










