Sep 23,2023 23:53

ప్రజాశక్తి-కాకినాడ ప్రజలపై విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 27న కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని పలువురు వామపక్షాల నాయకులు పిలుపు ఇచ్చారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్‌లో వామపక్షాల నాయకుల సమావ్శేం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, నాయకుడు దువ్వా శేషబాబ్జి, సిపిఐ నాయకులు పిఎస్‌.నారాయణ, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు గొడుగు సత్యనారాయణ, ఎపి రైతుకూలీ సంఘం నాయకులు వి.రాజుబాబు, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు వి.చిట్టిబాబు తదితరులు మాట్లాడారు. 2000 సంవత్సరంలో చేసిన విద్యుత్‌ పోరాటం వల్ల 20 ఏళ్లపాటు రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు అదుపులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ చట్టం 2022ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం చాలా దారుణమన్నారు. ఒకపక్క విద్యుత్‌ ఛార్జీలు పెంచడమే కాకుండా, వివిధ రకాల ఛార్జీల పేరుతో భారీగా విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి కాలం గడిచిపోయి నెలలు కావొస్తున్నా విద్యుత్‌ బిల్లులు మాత్రం ప్రతినెలా పెరుగుతూనే ఉన్నాయన్నారు. జగన్‌ ప్రభుత్వం తీరు ఈతపండు ఇచ్చి తాటిపండు తీసుకుంటున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుదల వల్ల చిన్న మధ్యతరహా పరిశ్రమలు చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ, మూతపడడం వల్ల నిరుద్యోగం కూడా పెరుగుతోందన్నారు. విద్యుత్‌ అనుబంధంగా ఉన్న సేవలు, ఆహార ధరలు కూడా పెరిగి ప్రజలపై రెండు రకాల భారాలు పడుతున్నాయన్నారు. ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు విద్యుత్‌ కంపెనీలకు లాభాలు దోచిపెట్టే పద్దతులు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వివిధ రకాల ఛార్జీల పేరుతో వేస్తున్న విద్యుత్‌ భారాలు పూర్తిగా రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని కూడా ఖండిస్తున్నామన్నారు. సెప్టెంబర్‌ 27 బుధవారం ఉదయం 10 గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వామపక్షాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ వామపక్షాల నాయకులు పప్పు ఆదినారాయణ, నరసింహ స్వామి, వి.సత్తిబాబు, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.