ప్రజాశక్తి - నరసరావుపేట : కేంద్రంలోని బిజెపి విధానాలను అన్ని రాష్ట్రాల కంటే ముందుగా రాష్ట్రంలోని వైసిపి అమలు చేస్తూ ప్రజలపై మోయలేని భారాలేస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు సాధారణ మధ్యతరగతి ప్రజలు మోయలేని విధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తూ పట్టణ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపు ద్వారా రూ.13 వేల కోట్లు పదేళ్లపాటు వసూలు చేసి అదాని కంపెనీలకు లాభాలు చేకూర్చే కేంద్ర ప్రభుత్వ విధానాలను వైసిపి అడ్డగోలుగా అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈ విధానాలపై ప్రతిపక్ష టిడిపి, జనసేన నోరు మెదపడం లేదన్నారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు విత్తనాలు సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రచార ఆర్భాటమేనన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవని చెప్పారు. గతేడాది ప్రకృతి వైపరీత్యాలతో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలురైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి విత్తనాలు, ఎరువులు రాయితీపై ఇవ్వాలని, రుణాలు మంజూరు చేయాలని కోరారు. రైతులకు టార్ఫాలిన్ పట్టాలు, ఇతర వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టుకు వచ్చేనెలలో సిఎం శంకుస్తాపన చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో నిధులు కూడా విడుదల చేసి పనులు ప్రారంభించాలని కోరారు. సమావేశంలో సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, జి.రవిబాబు, నాయకులు డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, జి.బాలకృష్ణ, టి.పెద్దిరాజు, కె.హనుమంతరెడ్డి, డి.విమల, జి.ఉమశ్రీ పాల్గొన్నారు.










