Jun 14,2023 00:05

మాట్లాడుతున్న సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు

ప్రజాశక్తి-తాడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచి వినియోగదారును దొంగదెబ్బ తీస్తోందని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. స్థానిక మేకా అమరారెడ్డి భవన్‌లో మంగళగిరి - తాడేపల్లి సిపిఎం విస్తృత సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు, జెవి రాఘవులు అధ్యక్షత వహించగా రామారావు మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగం రూ.100 అయితే సర్‌ ఛార్జీల పేరుతో రూ.200-300 వరకు భారం మోపుతున్నారని చెప్పారు. సగటున యూనిట్‌కు రూ.150 చొప్పున స్థిర ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీలు, ఆలస్యానికి అదనపు రుసుము కూడా వేసి వచ్చిన బిల్లులు వినియోగదారుల మోత మోయిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భారాలు మరో 24 నెలల పాటు మోయాల్సి ఉంటుందని చెప్పారు. ఇవి కాకుండా ప్రతినెలా ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో రూ.30-100 దాకా అదనపు భారం పడుతుందని, డిస్కమ్‌లకు వచ్చిన నష్టాల పేరుతో యూనిట్‌కు 40 పైసలు అదనంగా వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోకుంటే సచివాలయాలు, విద్యుత్‌ కేంద్రాల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం పేదలకు స్థలం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే సెంటు స్థలం సరిపోదని, కనీసం రెండు సెంట్లు ఇవ్వాలని కోరారు. పేదలకు ఇప్పుడు నివశిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్లస్థలాలను రెగ్యులరైజేషన్‌ చేసి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయరకులు ఎం.రవి, ఎస్‌ఎస్‌.చెంగయ్య, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.