
ప్రజలపై పెను భారాన్ని మోపుతున్న ప్రభుత్వాలను గద్దె దించాలి : సిపిఎం
ప్రజాశక్తి - పగిడ్యాల
దేశ ప్రజలపై అధిక పన్ను భారాన్ని , అధిక ధరల భారాన్ని మోపుతూ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలను గద్య దించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఎం రక్షణభేరి లో భాగంగా ఆదివారం జీపు జాత పగిడ్యాల కు చేరుకుంది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడారు. దేశములో కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతూ పేద ప్రజలపై అధిక భారాలు మోపుతూన్నా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. దేశంలో ఉన్న ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పాలన చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అప్పట్లో డిమాండ్ చేసిన బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన హామీలు ప్రత్యేక హోదా అమలు చేయకుండా బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ ప్రత్యమ్మయ్య ప్రణాళిక రూపొందించిందని ఈ ప్రణాళిక అమలుకై నవంబర్ 15న విజయవాడలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 31వ తేదీన నందికొట్కూరులో జరుగు బహిరంగ సభకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం ఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ నాయకులు పాల్గొంటారని పెద్ద ఎత్తున సిపిఎం కార్యకర్తలు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు కే భాస్కర్ రెడ్డి, టి.గోపాలకృష్ణ , బెస్తరాజు , మద్దిలేటి, ఆంజనేయులు, ఉశేనామ్మ, ఈశ్వరమ్మ, లక్ష్మన్న, కుమార్, వెంకటేశ్వర్లు, కర్ణ, శ్రీనివాసులు, చంటి , నాగన్న తదితరులు పాల్గొన్నారు.