ప్రజలపై భారం మోపే ట్రూ ఆఫ్, కస్టమర్ ఛార్జీలు రద్దు చేయాలి వామపక్ష పార్టీలు డిమాండ్
ప్రజలపై భారం మోపే ట్రూ ఆఫ్, కస్టమర్ ఛార్జీలు రద్దు చేయాలి
వామపక్ష పార్టీలు డిమాండ్
ప్రజాశక్తి- తిరుపతి సిటి: ప్రజలకు భారంగా మారిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించకపోతే విద్యుత్ ఉద్యమంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దింపుతామని వామపక్ష నాయకులు హెచ్చరించారు. బుధవారం ఉదయం 10 గంటలకి సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలు, సర్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అధికారం రాకముందు చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపుతున్నారని నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్లు వరకు ఉచితంగా ఇస్తానని ప్రకటించారని అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే 11సార్లు పెంచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి దేనిని తెలిపారు. మే నెలలో వచ్చిన బిల్లులు మాత్రమే ఒక్కొక్క ఇంటికి రూ.500లకు పైగా అదనంగా బిల్లు వేసారని దీనివలన ప్రజలపై భారం మోపడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రజలపై భారం మారిన విద్యుత్‌ఛార్జీలను తక్షణమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించుకోకపోతే బషీరాబాద్ తరహాలో విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను వైసీపీ ప్రభుత్వం అత్యంత ఉత్సాహంతో వేగవంతంగా అమలు చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం రైతు మోటార్లకు మీటర్ల బిగించడానికి ఆదానికి ధారాదత్తం చేశారని కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి అత్యధికంగా వ్యతిరేకత వస్తున్న తరుణంలో బిజెపి కనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో ఇప్పుడు ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని, ఇది కూడా ఆదాని సంస్థకే ఒప్పచెప్పారని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనపై ఉన్న కేసుల నుండి బయటపడడానికి అత్యుత్సాహంతో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారన్నారు. స్మార్ట్‌మీటర్లు వల్ల భారీ దోపిడీ జరుగుతుందని దీనివలన విద్యుత్ వినియోగదారులపై అధిక భారాలు మోపే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల తక్షణమే తగ్గించాలని స్మార్ట్ మీటర్లును పెట్టే విధానాన్ని వెంటనే విరమించుకోవాలని లేకుంటే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజలను చైతన్యవంతం చేసి వైసీపీ ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తెప్పిస్తామని హెచ్చరించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 15వ తేదీ వరకు పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని విస్తృతంగా ప్రచార కార్యక్రమం చేపట్టి 15వ తేదీన ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కే.రాధాకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు శశి కుమార్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్.శివ, కేవై రాజా, సిపిఎం నాయకులు వేణు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గసభ్యులు రామిశెట్టి వెంకయ్య, వెంకటరత్నం, సురేంద్ర పాల్గొన్నారు.










