
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్
అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ ఆర్టీసీ ఛార్జీల భారాలతో ప్రజలను దోచుకుతింటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సరికాదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.రవికుమార్ అన్నారు. బుధవారం స్థానిక చిట్వేల్ ఆటో స్టాండ్ వద్ద సిపిఎం సమరభేరి పోస్టర్‌లను ఆటో కార్మికులతో కలసి ఆవిష్కరించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ కేంద్రం విధిస్తున్న షరతులకు తలొగ్గి రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు భారాలు మోపుతోందన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులను కేంద్రం అమలు చేస్తూ రాష్ట్రాలపైనా రుద్దుతోందని చెప్పారు. రాష్ట్రం కూడా అప్పుల కోసం కేంద్రం విధించిన షరతులన్నీ అమలు చేస్తోందని, దీనివల్ల సామాన్య ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని తెలిపారు. విద్యుత్ ఛార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని, గతంలో రూ.250 బిల్లు వస్తే ఇప్పుడు రూ.500 వస్తోందని, అంటే బిల్లు 100 శాతం పెరిగిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున భారాలు పడుతుండటంతో పరిశ్రమలు కూడా మూతబడుతున్నాయని తెలిపారు. ఇవి చాలదన్నట్లు వ్యవసాయ మోటార్లకు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ట్రూఅప్, ఫ్యూయల్ సర్‌ఛార్జి పేరుతో ఎప్పుడో వాడుకున్న విద్యుత్‌కు ఇప్పుడు భారాలు వేస్తున్నారని, అద్దె ఇళ్లలో ఉండే సామాన్యులకు ఇది పెనుభారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలను, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి చేసిన దీక్షలను గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే తన సొంత కంపెనీలకే వాటాలు కట్టబెడుతూ దోచుకుంటున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లను అదానీ కంపెనీల నుండి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరలకు, ప్రజలపై భారాలకు వ్యతిరేకంగా 30వ తేదీ నుండి సెప్టెంబరు నాలుగోతేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో ప్రచారం, సంతకాల సేకరణ, ఒకటోతేదీన సచివాలయాల్లో వినతిపత్రాలు సమర్పిస్తామని, నాలుగోతేదీన అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని తెలియజేశార. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఉద్యమం ఉధతం చేస్తామన్నారు. అనంతరం పాతబస్టాండ్, చిట్వేలు రూట్‌లోని ప్రతి ఇంటికి, ప్రజలకు, వాహనదారులకు, టైలర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, సిపిఎం నాయకులు వెంకటేష్, సిద్దూ, ఆసిఫ్, బాలకృష్ణ పాల్గొన్నారు.