
ప్రజలను రక్షించేది పోలీస్ వ్యవస్థ ఒక్కటే
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- ఘనంగా పోలీస్ అమరవీరులకు నివాళులు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
యావత్ ప్రపంచం నిద్రపోయినా ప్రజలను రక్షించేది పోలీస్ వ్యవస్థ ఒక్కటేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. శనివారం నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు తోగూర్ ఆర్థర్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హాబీబుల్లా, జల వనరుల ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. సమాజమే కుటుంబంగా భావించి సొంత కుటుంబాలను కూడా పక్కనపెట్టి నిర్విరామంగా పని చేసే వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. శాంతిభద్రతల అంశంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో ఉందన్న విషయం తాను సదరన్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనడం వల్ల మరింత అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడే తరుణంలో విధులు నిర్వర్తిస్తూ 188 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జిల్లాకు చెందిన కానిస్టేబుల్ నరేంద్రనాథ్, హౌంగార్డు రాజశేఖర్‌లు రౌడీ మూకలను నిలువరించే ప్రయత్నంలో చనిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన సహాయ కార్యక్రమాలలో తన పూర్తి స్థాయి తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో పోలీసులకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి విద్య, వైద్య సేవలందించడం అభినందనీయమన్నారు. తన తండ్రి తనను ఆర్మీకి పంపాలనుకుని తమపై ప్రేమ వల్ల పంపలేకపోయిన విషయం తరచూ చెప్పేవారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నంద్యాల జిల్లా అంటే ఫ్యాక్షన్ ప్రాంతమనే ముద్ర తొలగించుకుని అత్యున్నత పరిపాలన వ్యవస్థ ఉన్న జిల్లాగా అవతరించామని, అందుకు కృషి చేస్తోన్న పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ జిల్లాలో కానిస్టేబుల్, హౌంగార్డు మరణాలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అందరి సహకారంతో శాంతి భద్రతలను కాపాడగలిగామన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.
ఫ్రూట్ మార్కెట్ అగ్ని ప్రమాద బాధితులకు రూ. 23 లక్షల 45 వేలు చెక్ అందజేసిన మంత్రి బుగ్గన. ఎమ్మెల్యే శిల్పా రవి
నంద్యాల పట్టణం గాంధీ చౌక్ ఫ్రూట్ మార్కెట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 14 మంది బాధిత వ్యాపారులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 23 లక్షల 45 వేలు చెక్‌ను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి కొంత మేర నష్టపరిహారాన్ని అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి ప్రభాకర్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తంరెడ్డి, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధి కలాం, సభ్యులు, వైసిపి నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.