Nov 21,2023 00:30

మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నాడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నెరవేర్చకుండా ప్రజలను మోసగించారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సామాజిక సాధికార యాత్ర సోమవారం అచ్యుతాపురంలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు పని కట్టుకొని గ్యాస్‌ పెట్రోలు నిత్యవసర సరుకులు ధరలు పెరిగాయని ప్రచారం చేస్తున్నాయని, కాని దేశంలో అన్ని రాష్ట్రాలలో వీటి ధరలు పెరిగాయని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందన్నారు. రోడ్లపై పడిన గుంతలు చూపించి ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రహదారులు వేస్తే అభివృద్ధి జరిగినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధానాలు చేపట్టడం ద్వారా రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, ఎలమంచిలి మున్సిపల్‌ చైర్మన్‌ పిల్ల రమకుమారి, వైయస్సార్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్‌, నాయకులు ఆర్‌ జగన్నాథం, డి.సూర్యనారాయణరాజు, లేళ్ల అప్పిరెడ్డి, దేశం శెట్టి శంకర్రావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
సిపిఎం నేతల గృహ నిర్బంధం
సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా సిపిఎం అచ్యుతాపురం మండల కన్వీనర్‌ ఆర్‌.రాము, నాయకులు కె.సోమునాయుడును సోమవారం ఉదయమే పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. అనంతరం వారిని ద్విచక్ర వాహనాలపై ఎలమంచిలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నిర్బంధ చర్యలను ప్రజాతంత్ర వాదులు ఖండించాలని సిపిఎం నేతలు కోరారు. వైసిపి ప్రభుత్వానికి సిపిఎం అంటే ఎందుకు భయమని ప్రశ్నించారు. అరెస్టులు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సిపిఎం నేత కర్రి అప్పారావు హెచ్చరించారు.
పోలీసుల నిర్భందంపై ఖండన
అనకాపల్లి : వైసిపి చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర అచ్యుతాపురం వస్తున్న సందర్భంగా సిపిఎం అచ్యుతాపురం మండల కన్వీనర్‌ ఆర్‌.రాము, మండల నాయకులు కె.సోమునాయుడులను ఇంటి వద్ద పోలీసులు గృహ నిర్భందించడం, అరెస్టు చేయడంపై సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కరువును, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా సిపిఎం నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అణిచివేత, నిర్భంద చర్యలను మానుకొని ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు.