Mar 05,2023 00:27

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పల్లా శీనివాసరావు

ప్రజాశక్తి -గాజువాక : ఆంధ్ర ప్రజలను మోసగించేందుకే విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. పాత గాజువాకలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో విధ్వంసాలకు, కూల్చివేతలకు, పారిశ్రామికవేత్తలను బయటకు తరిమివేసే కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు సమ్మిట్ల పేరుతో కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
2017లో చంద్రబాబు నాయకత్వాన విశాఖపట్నంలో అంతర్జాతీయ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరుగుతుంటే ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్‌ అంటూ ఆ సదస్సును దెబ్బకొట్టాలని ప్రయత్నించిన చరిత్ర జగన్మోహన్‌ రెడ్డిదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంఒయులు చేసుకున్న లులూ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్స్‌, జాకీ, అదానీ డేటా సెంటర్‌ను వెళ్లగొట్టారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రంతో జగన్మోహన్‌రెడ్డి లాలూచీపడ్డారని ఆరోపించారు. 770 రోజులుగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, నిర్వాసితులు తీవ్ర ఆందోళనలు చేస్తుంటే ముఖ్యమంత్రికి పట్టడంలేదు సరికదా నిరసన తెలుపుతున్న పోరాట కమిటీ సభ్యులను శుక్రవారం నిర్బంధించడం ప్లాంట్‌పై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా విశాఖ ఉక్కు ప్రైవేటేకరణ వ్యతిరేక ఉద్యమ నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పుచ్చ విజరుకుమార్‌, ప్రసాదుల శ్రీనివాస్‌, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, ముత్యాల నాయుడు, పులి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.