
ప్రజలను చైతన్యవంతం చేయడమే పిఎన్‌ఎం ధ్యేయం
- ప్రజానాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇలాది నాగరాజు
ప్రజాశక్తి - ఆత్మకూర్
దేశంలో మోడీ ప్రభుత్వానికి వైసిపి వత్తాసు పలుకుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్దిచెప్పే రోజులు ఆసన్నమయ్యాయని, ప్రజలను చైతన్యవంతం చేయడమే ప్రజానాట్యమండలి ప్రధాన ధ్యేయమని ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇలాది నాగరాజు తెలిపారు. మంగళవారం పట్టణంలోని డాక్టర్ ఏ.ధనుంజయ మీటింగ్ హాల్‌లో పిఎన్‌ఎం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు డాల్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు దేశం, రాష్ట్రంలో కలుషితమైన రాజకీయాలను కళలతోనే పారదోలే రోజులు వచ్చాయని అన్నారు. ప్రజానాట్యమండలి నిరంతరం కళకారుల సమస్యలపై పోరాటం చేస్తుందని, డప్పు కళకారులకు పెన్షన్ 5 వేల రూపాయలు ఇవ్వాలని, అర్హులైన డప్పు కళకారులకు పెన్షన్ అప్లై చేసుకోడానికి సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఆప్షన్ లేదని చెప్పుతున్నారని, చాల మంది కళకారులు సచివాలయం చుట్టూతిరుగుతున్నారని, ప్రభుత్వం ఆప్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కోయలకొండ నాగరాజు మాట్లాడుతు కమిటీలో గత కార్యక్రమాలపై సమీక్ష జరిపి, భవిష్యత్ కార్యక్రమాలకై రాష్ట్ర స్థాయి పాటలు, డాన్స్, స్క్రీట్ శిక్షణ శిబిరం అక్టోబర్ 4 నుండి 8వ తేది వరకు తాడేపల్లి వడ్డెశ్వరంలో జరుగుతున్నాయని చెప్పారు. ఈ శిక్షణ శిబిరంలో నూతన కళారూపాలు తయారు చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికి కవులు, కళకారులు సిద్ధం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళకారులను ప్రోత్సహించడం లేదన్నారు. జానపద కళకారులు నేడు కళారంగాన్ని వదులుకొని సూదుర ప్రాంతాలకు వలసలు పోయి కుటుంబాలను పోషించుకునే దీన స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాంస్కృతిక శాఖ పేరుకే తప్ప కళకారులకు ఎలాంటి ఉపయోగం లేదని, ఆ శాఖ మంత్రి సినిమా రంగం నుండి వచ్చినా కళాకారులను ప్రోత్సహించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. సమావేశంలో ప్రజానాట్యమండలి నాయకులు పురుషోత్తం, సుధాకర్, నాగమణి, వెంకటయ్య, శేషు తదితరులు పాల్గొన్నారు.