ప్రజాశక్తి - పిడుగురాళ్ల/రాజుపాలెం/బెల్లంకొండ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర బుధవారం రాజుపాలెం, బెల్లంకొండ మండలాల్లో కొనసాగింది. తొలుత కొండమోడు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమై మాచాయపాలెం గ్రామం వరకు నిర్వహించారు. తొలుత లోకేష్‌ను కొండమోడు గ్రామస్తులు కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామం కోటనెమలిపురి పంచాయతీలో ఉందని, ఈ గ్రామానికి ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని విన్నవించారు. 30 ఏళ్లుగా అటవీ భూమిలో నివాసం ఉంటున్న వీరమ్మకాలనీ, టిఎన్ నగర్ ప్రజలకు ఇంటి పట్టాలు ఇప్పించాలన్నారు. అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కారానికి లోకేష్ హామీనిచ్చారు. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్‌ను కలిసి సమస్యలు విన్నవించారు. టిడిపి హయాంలో చేపట్టిన గోదావరి, పెన్నా నదుల అనుసంధాన పథకం నిలిచిపోయిందని, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.
పాదయాత్ర తొలుత రాజుపాలం మండలంలోకి ప్రవేశించగానే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, టిడిపి నాయకులు కోడెల శివరాం, మల్లేశ్వరరావు తదితరులు ఘనస్వాగతం పలికారు. పాదయాత్రలో లోకేష్ వెంట కన్నా నడిచారు. చౌటపాపాయపాలెంలో జరిగిన బహిరంగ సభలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర సంపద మొత్తాన్ని ఏకీకృతం చేసి జగన్మోహన్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే దోచుకుంటోందన్నారు. జగన్‌ను చూసి వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసిపి నాయకుల దోపిడీకి పోలీసులు సహకరిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లినప్పుడు చిత్తూరు జిల్లాలో వైసిపి నాయకులు రాళ్లదాడి చేయడమే కాకుండా హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, ఇలాంటి దుర్మార్గపు పాలకులను గద్దె దించాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని, సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు.
పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలంలోకి పాదయాత్ర ప్రవేశించింది. నాగిరెడ్డిపాలెం వద్ద లోకేష్‌కు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఘనస్వాగతం పలికారు. సమస్యలపై నాగిరెడ్డిపాలెం గ్రామస్తులు లోకేష్‌కు విన్నవించారు. గ్రామంలో ఉప్పునీరు వస్తుండటంతో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. గ్రామంలోని 130 ఎకరాల చెరువులో కొంత భాగాన్ని మంచినీటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. మురుగునీటి సమస్య ఉందని, సైడు కాల్వలు ఏర్పాటు చేయాలని కోరారు. తరువాత బెల్లంకొండ గ్రామస్తులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మురుగునీరు వెళ్లే మార్గంలేక దుర్గంధం వస్తోందని వివరించారు. బెల్లంకొండ ఎంతో చరిత్ర కలిగిన కొండ అని, ఆ కొండపై శివాలయం కూడా ఉందని, దాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం పులిచింతల ముంపు గ్రామాలైన ఆర్ అండ్ ఆర్ సెంటర్, న్యూ చిట్యాల గ్రామస్తులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. పరిహారం కింద సొమ్ములు ఇప్పటివరకు అందలేదన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ముంపు బాధితులకు పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. దీర్ఘకాలంగా పులిచింతల ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం అందకపోవడం దురదృష్టకరం అన్నారు. అధికారంలోకి వచ్చాక సాంకేతిక, న్యాయపరమైన చిక్కులను తొలగించి పులించిల ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
నేటి పాదయాత్ర వివరాలు
ఉదయం 7 గంటలకు మాచాయపాలెం క్యాంప్ సౖౖెట్ నుంచి పాదయాత్ర ప్రారంభం
7.45 గంటలకు చండ్రాజుపాలెం వద్ద స్థ్థానికులతో సమావేశం
8.15 గంటలకు కందిపాడులో స్థ్థానికులతో సమావేశం
9.45 గంటలకు ఆవుులవారిపాలెంలో స్థానికులతో సమావేశం
11.15 గంటలకు దొడ్లేరు శివార్లలో వైసిపి బాధితులతో ముఖాముఖి
మధ్యాహ్నం 12.15 గంటలకు దొడ్లేరు శివార్లలో భోజన విరామం
సాయంత్రం 4 గంటలకు దొడ్లేరు శివారు నుంచి పాదయాత్ర కొనసాగింపు
4.45 గంటలకు దొడ్లేరులో పాదయాత్ర 2400 కిలోమీటర్లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ
6.15 గంటలకు అనంతారంలో స్థ్థానికులతో సమావేశం
రాత్రి 8.15 గంటలకు క్రోసూరు శివారు విడిది కేంద్రంలో బస










