Sep 26,2023 22:58

  • పిఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్‌

ప్రజాశక్తి-గన్నవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరచడానికి మూడు జాతాలు అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 7 వరకు తిరుగుతాయని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్‌ తెలిపారు. గన్నవరంలో మూడు రోజులుగా జరుగుతున్న పాటకు డప్పు రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన సభలో అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగే మూడు జాతాలు నవంబర్‌ 7కు విజయవాడ చేరుకుంటాయన్నారు. ప్రజలను చైతన్యపరచడమే జాతా ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేసి ఉద్యోగులను, కార్మికులను వీధుల్లోకి నెట్టేస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. మోడీ తోక పట్టుకుని తిరుగుతూ రాష్ట్రంలోని పాలకులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో ప్రజా మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఉద్యమాల్లోకి వచ్చి ప్రజా వ్యతిరేకులను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కె ఖాసిం, అధ్యక్షులు కొండల బాబు, జిల్లా నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు.