
ప్రజాశక్తి- రావికమతం: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హత గల ప్రజలందరికీ అందే విధంగా సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ పటాన్ శెట్టి రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. రావికమతం మండలం మేడివాడ గ్రామంలో శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా జగనన్న కాలనీలో చేపడుతున్న గృహ నిర్మాణపు పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి వీలైనంత తొందరలో పూర్తి చేయాలని సంబంధిత గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. కాలనీలో మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారంపై అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల నిర్వహణపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు.ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంతరం జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించారు. ప్లేగ్రౌండ్, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించారు.
రావికమతం మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ఆక్రమణలు తొలగించిన నేపథ్యంలో కల్వర్టుల నిర్మాణంకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని, చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడానికి వీలైనంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయాలని ఎంపీపీ పైలరాజు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
లబ్ధిదారుల మొర
రావికమతంలో జగనన్న కాలనీలో రోడ్లు, విద్యుత్తు, మంచినీటి సదుపాయం, తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ విషయమై పలుమార్లు మండల స్థాయి అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన కనీస స్పందన లేదని కాలనీ లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కాలనీని సందర్శించి మౌలిక సదుపాయాలన్ని గుర్తించి వీడియో తీసి తమకు పంపించాలని తెలిపారు. తక్షణమే పనులను చేపట్టి పూర్తి చేయాలని హెచ్చరించారు. మండల కేంద్రంలోనే ఇటువంటి పరిస్థితి నెలకొంటే మిగిలిన మారుమూల గ్రామాల పరిస్థితి ఏమిటని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఉమామహేశ్వరరావు, ఎంపిడిఓ వెంకన్నబాబు, పిఓపిఆర్డి రమణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.