ప్రజాశక్తి-సింహాచలం: బిఆర్‌టిఎస్ బాధితులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో న్యాయం చేస్తామని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక గౌరీ కల్యాణ మండపంలో సోమవారం సింహాచలం- అడివివరం రోడ్డులో నివసిస్తున్న బిఆర్‌టిఎస్ బాధితులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సింహాద్రి అప్పన్నపైనా, ఇక్కడ ఉన్న ప్రజల పైనా అపారమైన అభిమానం, నమ్మకం ఉందని, అందరికీ మంచి జరగాలనే తలంపుతో ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహులు మాట్లాడుతూ, సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న బిఆర్‌టిఎస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న బాధితులందరికీ ఒకే విధంగా న్యాయం జరగాలన్నారు. గతంలో గోశాల నుంచి తొలిపావంచా వరకు ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబల్ టిడిఆర్, కొంత కాంపెన్సేషన్ ఇచ్చి, స్థలాలు మాత్రం ఇంతవరకు కేటాయించలేదని తెలిపారు. ఇప్పుడు తొలి పావంచా నుంచి అడివివరం వరకు ఉన్న రెండో ఫేజ్ బాధితులకు నాలుగు టిడిఆర్‌లు ఇచ్చి నష్టపరిహారాన్ని ఇవ్వడంతో పాటు అందరికీ ఆమోదయోగమైన రీతిలో సింహాచలం దగ్గరలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎసిపి శాస్త్రి, తహశీల్దార్ రమణయ్య, వైసిపి నాయకులు ఎర్రవరం బాబు, కొలుసు ఈశ్వరరావు, లంక సత్తిబాబు, స్థానిక టిడిపి నాయకులు సత్తివాడ శంకరరావు, పంచదార శ్రీనివాసరావు, లండ శ్రీను పాల్గొన్నారు.










