ప్రజాశక్తి - నందవరం
ప్రజలందరి సహకారంతో ఉత్తమ సేవలందించడంతో నందవరం పోలీసు స్టేషన్ దేశ జాబితాలో నిలిచిందని సిఐ మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం నందవరం పోలీస్ స్టేషన్‌ను కేంద్ర హోంశాఖ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీసు స్టేషన్ల జాబితాలో నందవరం పోలీసు స్టేషన్‌కు అవార్డులు జాబితాలో చోటు దక్కిందన్నారు. రాష్ట్రంలో 3 స్టేషన్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 10 పోలీసు స్టేషన్లతో కేంద్ర హోంశాఖ ఓ ప్రాథమిక జాబితాను రూపొందించిందన్నారు. స్టేషన్‌లో ప్రజలకు మెరుగైన సేవలందించడం, నేరాలు జరగకుండా ముందస్తు కట్టడి, అదుపు చేసేందుకు తీసుకున్న చర్యలు వంటి అంశాలను ఈ జాబితా రూపొందించిందని తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామాలను ప్రశాంత వాతావరణంలోకి తీసుకు రావడానికి ప్రస్తుత, గతంలో పని చేసిన పోలీసుల కృషి ప్రశంసనీయమని అన్నారు. మండలంలో పోలీసు శాఖ ఎలాంటి వాతావరణం నెలకొల్పిందో కేంద్ర హోంశాఖ అధికారి పరిశీలించి, నివేదికను పంపుతారని తెలిపారు. ఎస్‌ఐ పి.తిమ్మయ్య, పోలీసులు పాల్గొన్నారు.
సుందరంగా ఉన్న నందవరం పోలీసు స్టేషన్










