
ప్రజాశక్తి-బొండపల్లి : నాలుగున్నరేళ్లలో వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి.. ఆ పార్టీ శ్రేణులను కోరారు. బొండపల్లి మండలం గొట్లాం సత్య ఫంక్షన్ హాల్ ఆవరణలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అధ్యక్షతన వైసిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలోనే అమలయ్యాయని చెప్పారు. రూ.2.35 లక్షల కోట్లను ప్రజా సంక్షేమం పేరిట బడుగు, బలహీన వర్గాల వారికి అందించామని వివరించారు. జగనే ఎందుకు ఈ రాష్ట్రానికి కావాలి? అనే అంశాలను ప్రజలకు వివరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తప్పు చేశారు.. అందుకే జైల్లో..
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ఎందుకు ఆలోచన చేయలేదని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమపై దృష్టి సారించలేదని విమర్శించారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే జైల్లో ఉన్నారని తెలిపారు. కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేయకపోతే నిరూపించుకోవాలని సూచించారు.
సమావేశంలో జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు పి.సురేష్‌బాబు, రఘురాజు, పి.విక్రాంత్, ఎఎంసి చైర్మన్ వి.ముత్యాలునాయుడు, ఎంపిపిలు చల్ల చలంనాయుడు, బెల్లాన జ్ఞాన దీపిక, గేదెల సింహాద్రి అప్పలనాయుడు, పి.హైమావతి, జెడ్‌పిటిసిలు రాపాక సుర్యాప్రకాశరావు, గార తవుడు, వర్రి నర్సింహమూర్తి. రౌతు రాజేశ్వరి, వైసిపి మండల అధ్యక్షులు బొద్దల చిన్నం నాయుడు, బూడి వెంకటరావు, కడుబండి రమేష్‌నాయుడు, గొర్లె రవికుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు బి.వి.ప్రభూజి, మహంతి రమణ, గొల్లు సతీష్ కుమార్ పాల్గొన్నారు.