* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సచివాలయ, జెసిఎస్ కన్వీనర్లకు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని సచివాలయ, జెసిఎస్ కన్వీనర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రత్యేక పరిశీలకులు, ఎమ్మెల్సీ రఘురామరాజుతో కలిసి ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థతో 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 500 సేవలు మండల కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే అందిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి తావు లేకుండా పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. సచివాలయ, జెసిఎస్ కన్వీనర్లు వార్డుల వారీగా ప్రజానీకంతో మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజలకు అందిన లబ్ధిని వివరించాలని సూచించారు. ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత కన్వీనర్లదేనని స్పష్టం చేశారు. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాలు గ్రామస్థాయిలో విజయవంతం కావడంలో కన్వీనర్ల పాత్ర కీలకమైందని కొనియాడారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసిపిని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, వైసిపి నాయకులు బొడ్డేపల్లి రమేష్ కుమార్, గురుగుబెల్లి శ్రీనివాసరావు, బొడ్డేపల్లి నారాయణరావు, నిరంజన్ బాబు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, నాలుగు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










