Oct 30,2023 21:57

మాజీ మంత్రి పరిటాల సునీత

        అనంతపురం కలెక్టరేట్‌ : రాప్తాడు నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి సంబంధించి మాజీ మంత్రి పరిటాల సునీత రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. నవంబర్‌ మూడవ తేదీ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అనంతపురంలోని తన నివాసంలో అనంతపురం, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నాయకులతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఏఏ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నది నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. 4, 5వ తేదీల్లో అనంతపురం రూరల్‌ పరిధిలోని ఆకుతోటపల్లిలో కార్యక్రమం ఉంటుందన్నారు. 6, 7 తేదీల్లో ఆత్మకూరు మండలంలో 8, 9 తేదీల్లో రాప్తాడు మండలాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ అనే అద్భుతమైన పథకాలను తీసుకొచ్చారన్నారు. టిడిపికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అధికార వైసిపి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి టిడిపి ఆరు పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు, భూదందాలు, వైఫల్యాలనూ ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి కూడా ప్రజలందరికీ తెలియజేయాలన్నారు.