
కొత్తచెరువు : ప్రజలందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వ జగన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను అన్ని గ్రామాల్లోనూ నిర్వహిస్తోందని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అరుణ్‌బాబు తెలిపారు. కొత్తచెరువు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడికొచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఏడు రకాల పరీక్షలను నిర్వహించి, హెల్త్ ప్రొఫైల్‌లో వారి వివరాలను నమోదు చేయాలని, అవసరమైన వారికి కేస్ షీట్లను అందించాలని వైద్యులకు సూచించారు. శిబిరాల్లో ఇసిజితో సహా మొత్తం 14 రకాల పరీక్షలను నిర్వహించి, 105 రకాల మందులను ఉచితంగా ఇవ్వాలని తెలిపారు. కంటి పరీక్షలను కూడా నిర్వహించి, అవసరమైనవారికి ఉచితంగా కళ్లద్దాలను అందజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మరింత ఆరోగ్య సేవలు గ్రామస్ధాయిలో ప్రతి ఒక్కరికీ అందాలనే ఉద్ధేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, తహశీల్దార్ రామాంజనేయులు రెడ్డి, ఈఒఆర్‌డి సిద్ధారెడ్డి, సర్పంచి రాధా నాగరాజు, డాక్టర్లు మమత భవాని, అశ్వత్ కుమార్ పాల్గొన్నారు.