Nov 04,2023 16:07

మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ కె.విజయరాజు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
   రహదారి నిబంధనలను పాటిస్తూ, సురక్షిత ప్రయాణ సేవలను ప్రజలకు డ్రైవర్లు అందించాలని మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ కె.విజయరాజు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జూట్‌ మిల్‌ సెంటర్‌ దగ్గర ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన రహదారి భద్రత అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయరాజు, నగర ట్రాఫిక్‌ సిఐ కెవిఎస్‌వి.ప్రసాద్‌ డ్రైవర్లనుద్ధేశించి మాట్లాడుతూ రహదారి నిబంధనలను పాటించాలని, డ్రైవర్లు అందరూ యూనిఫామ్‌ ధరించాలని, లైసెన్స్‌ వాహన పత్రాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువమంది యువకులే ఉన్నారని, నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ రవాణా రంగ కార్మికులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా సమగ్ర సంక్షేమ బోర్డును(వెల్ఫేర్‌ బోర్డు) ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో, దేశంలో రవాణా రంగం నుండి కోట్లాది రూపాయలు ఆదాయాన్ని సంపాదించుకుంటున్న ప్రభుత్వాలు డ్రైవర్ల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రవాణా రంగ చట్ట సవరణ పెను ప్రమాదంగా మారిందని, రాష్ట్రంలో జిఓ నెంబర్‌ 21 వలన ఫైన్‌లు అనేక రెట్లు పెరిగిపోయాయని, పెంచిన రోడ్‌ టాక్స్‌ను, గ్రీన్‌ టాక్స్‌ను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రహదారుల మరమ్మత్తులు చేపట్టాలని, ప్రమాదాలు నివారించాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక అవగాహన సదస్సులను ప్రభుత్వమే నిర్వహించాలని అమరావతి లారీ అసోసియేషన్‌ కార్యదర్శి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రత అవగాహన సదస్సుకు ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుద్ధ నాగ సూరిబాబు, జె.గోపి, సిహెచ్‌.అమరకుమార్‌, జివి.రవీంద్రబాబు, ఎం.ఇస్సాకు, ఎ.జానుబాబు నాయకత్వం వహించారు. ఈ సదస్సుకు హాజరైన మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ కె.విజయ రాజు, ఏలూరు నగర ట్రాఫిక్‌ సిఐ కెవిఎస్‌పి.ప్రసాద్‌లను శాలువాలు, బొకేలతో ఆటో యూనియన్‌ నాయకులు సన్మానించారు.