ప్రజాశక్తి-కాకినాడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న ఆరోగ్య, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సమగ్రంగా అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ ఎంపీ వంగా గీత కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కాకినాడ జిల్లా అభివద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ వంగా గీత అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, జిల్లాలో అమలు జరుగుతున్న తీరు, ప్రగతిని కమిటీ సమీక్షించింది. తొలుత చేపట్టిన వైద్య, ఆరోగ్య రంగ సమీక్షలో ఎంపీ గీత మాట్లాడుతూ ప్రజలందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, సురక్షిత మాతృత్వం, మాతా శిశు మరణాలను తగ్గించే లక్ష్యాలుగా అమలవుతున్న జాతీయ ఆరోగ్య మిషన్, ఫ్యామిలీ డాక్టర్ పధకాలను అధికారులు అంకితభావంతో అమలు చేయాలని కోరారు. తద్వారా ఆరోగ్యవంతమైన మానవ సంపదను దేశానికి అందించాలన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు అందించేందుకు పనులు ముమ్మరంగా చేయాలన్నారు. పౌష్టికాహార కార్యక్రమాల ద్వారా మహిళలు, శిశువుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎంపి కోరారు. ఈ అంశంలో అదనపు నిధులు కల్పించి మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగైన మెనూ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ కౌసల్ యోజనా ద్వారా మహిళలు ఆర్థిక శక్తులుగాను, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో దాదాపు 30 కోట్ల నిధులతో ఆసుపత్రి భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిని నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత వర్షా కాలంలో ప్రబలే వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించే కార్యాచరణ క్రింద జిల్లాలో చేపట్టిన ఫీవర్ సర్వే, డెంగ్యూ సర్వే కార్యక్రమాలను విస్తతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వైద్య, ఆరోగ్య అధికారులను ఆదేశించారు. జగ్గంపేటలో ఖాళీగా ఉన్న స్త్రీ శక్తి భవన్‌లో వృత్తి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు కోరారు. పిహెచ్‌సిల్లో గర్భిణులకు చేరువలో ప్రసూతి సేవలు అందేలా చూడాలని, పలువురు ఎంపిపిలు కోరారు. ఈ సమావేశంలో జెడ్‌పి చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, సిఇఒ ఎ.రమణారెడ్డి, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ రమేష్, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ విష్ణువర్ధని, డిఆర్‌డిఎ పీడీ శ్రీరమణి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










