Aug 21,2022 22:31

ఉపకార సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కంచర్ల అచ్యుత రావు

ప్రజాశక్తి - ఆరిలోవ : ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉపకార్‌ సేవా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ అధినేత కంచర్ల అచ్యుతరావు తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధి 12వ వార్డు నెహ్రూ నగర్‌ ప్రాంతంలో ఉపకార్‌ సంస్థ కార్యాలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపకార్‌ సంస్థల ద్వారా చేయు కార్యక్రమాలను వివరించారు. ప్రధానంగా రూ.10కే భోజనం, చేయూత కార్యక్రమం ద్వారా ట్యాంకర్లతో తాగు నీటి సరఫరా, పేదలకు నెలవారీ బియ్యం పంపిణీ, మెడికల్‌ హెల్ప్‌, విద్య అవసరాలు, వృద్ధాశ్రమం, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అన్న సమారాధన కార్యక్రమాలు, దేవాలయాలు, చర్చి, మసీదుల నిర్మాణాలకు ఆర్థిక సహాయం, రక్త సేకరణకు రక్తదాన శిబిరాలు, యువకులకు ప్రోత్సాహంగా క్రీడా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, గర్భిణులకు సీమంతాలు, పౌష్టికాహారం, చిరు వ్యాపారులకు చేయూత, నిరుద్యోగులకు ఉపాధి కల్పన తదితరాల ద్వారా ప్రజలకు సేవ చేయు నిమిత్తం ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ముందుగా యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పెద్దగదిలి, బాలాజీనగర్‌, ఆరిలోవ టిఐసి పాయింట్‌, నెహ్రూనగర్‌ గుండా కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళా సంఘాలు, కళాకారుల బృందాలు తదితరులు పాల్గొన్నారు.