Aug 20,2023 23:41

మహాసభలో నాయకులు

ప్రజాశక్తి - మాచర్ల : సైన్స్‌ ఎంతో పురోగమించినా దాని ఫలితాలు సామాన్యుల చెంతకు పూర్తిస్థాయిలో చేరలేదని, సమాజంలో అశాస్త్రీయ భావజాలం ఇంకా రాజ్యమేలుతూనే ఉందని జన విజ్ఞాన వేదిక (జెవివి) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్‌.వేణుగోపాల్‌ అన్నారు. జెవివి పల్నాడు జిల్లా 2వ మహాసభను పట్టణంలోని కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. మహాసభకు జెవివి పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు కె.ఆదినారాయణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన వేణుగోపాల్‌ మాట్లాడుతూ సైన్స్‌ ఇప్పటికి పాఠ్య గ్రంథాల్లో ఉందేగాని జీవన విధానంగా మారలేదన్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రజల్లో పనిచేస్తున్న అతి పెద్ద ప్రజాసైన్స్‌ ఉద్యమ సంస్థగా జెవివి కృషి మరింత కొనసాగాలన్నారు. అక్షరాస్యత, సారా వ్యతిరేక ఉద్యమం, కూల్‌ డ్రింక్‌ వ్యతిరేక ఉద్యమం లాంటి ఎన్నో పోరాటాలను జెవివి చేసిందని, పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ ఎంతో ఆదరాభిమానాలను పొందిందని గుర్తు చేశారు. ఉన్నతమైన సమాజం కోసం చాలామంది తమ సమయాన్ని వెచ్చించి పని చేస్తున్నారని, అయితే శాస్త్రీయ ఆలోచన క్రమాన్ని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని, హేతు విరుద్ధ శక్తుల పట్ల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేసే కర్తవ్యం జెవివి నేరవేరుస్తోందాని చెప్పారు. కృష్ణవేణి జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ అండ్‌ ప్రిన్సిపాల్‌ వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రజల్లో సైన్స్‌ పట్ల అవగాహన పెంచేందుకు, మూఢనమ్మకాలను పారద్రోలేందుకు విద్యావంతులు, మేథావులు తోడవాల్సిన అవసరం ఉందన్నారు. కె.ఆదినారాయణ మాట్లాడుతూ సమాజం బాగుంటేనే దేశం బాగుంటుందని, శాస్త్రీయ అవగాహనలు ఇందుకు కీలకమని చెప్పారు. జెవివి నిర్వహించే కృషికి అందరి సహకారం అవసరమన్నారు. జెవివి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరించే పనిలో పడ్డాయని, దాన్ని జెవివి పూర్తిగా ఖండిస్తోందని అన్నారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక
అనంతరం జెవివి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్‌ బుచ్చిబాబు తిరిగి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జెవికెఎస్‌ ప్రసాద్‌ గౌరవాధ్యక్షులుగా కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపాల్‌ వై.వెంకట్రామయ్య, కె.ఆదినారాయణ, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్‌గా చలపతి రావు ఎన్నికయ్యారు. మహాసభలో ఎస్‌.చలపతిరావు, డాక్టర్‌ బెజ్జంకి జగన్నాథచార్యులు, ఎ.నాగేశ్వరరావు, ఎ.దుర్గాభవాని, ఎస్‌కె గాలిబ్‌, చైతన్య, రాఘవేంద్ర పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మహాసభలో పట్టణంలోని వాణి విద్యానికేతన్‌ డైరెక్టర్‌ కెవి రమణ చేసిన మ్యాజిక్‌ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. కేవలం చిన్నచిన్న ట్రిక్కులతో ప్రజల్ని స్వామీజీల పేరుతో ఎలా మోసం చేస్తుంటారో వివరించారు.