Jul 20,2023 21:18

మాట్లాడుతున్న విష్ణుప్రీతం రెడ్డి

కడప దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫల మైందని కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతమ్‌ రెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు లావణ్య ఆరో పించారు. గురువారం స్థానిక జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మణిపూర్‌లో విధ్వంసకాండపై ప్రధాని మోడీ కనీసం స్పందించడం లేదని వారు విమర్శించారు. పైగా అక్కడ ఏం జరుగుతుందో తెలియకూడదని ఇంటర్నెట్‌ కనెక్షన్లు కూడా కట్‌ చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్‌ హౌమ్‌ మినిస్టర్‌ అమిత్‌ షా అయితే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లపై, జరుగుతున్న విధ్వంసకాండ పై చర్యలు తీసుకోవడంలో లేదని ఆరోపించారు. ముగ్గురు మహిళలను నగంగా ఊరేగింపు చేసి, తర్వాత వారి మీద అత్యాచారం చేసి విధ్వంసం చేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదేనా దేశంలో మహిళలకు మీరు ఇచ్చే రక్షణ అని మండిపడ్డారు. మోడీ, అమిత్‌ షాల కుటుంబాలకో లేక బిజెపి మంత్రుల కుటుంబాలకో ఇలా జరిగితే మీరు స్పందించకుండా ఉంటారని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మామిళ్ళ బాబు పాల్గొన్నారు.