ప్రజాశక్తి-నక్కపల్లి:రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు నిస్వార్ధమైన సేవలు అందిస్తున్నట్లు రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చీడిక గ్రామంలో శనివారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని రాష్ట్ర కో ఆర్డినేటర్ బీవీఎస్ కుమార్, విశాఖ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ శివ నాగేంద్రరెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి రమణ ముఖ్య అతిథిగా హాజరై రెడ్ క్రాస్ సేవలను వివరించారు. అనంతరం చీడిక గ్రామస్థులకు రెడ్ క్రాస్ సొసైటీ తరపున వంట సామగ్రి, దోమ తెరలు, శానిటరీ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ రాష్ట్ర అధ్య క్షుడు శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ, మారుమూల గ్రామాలు, నిరుపేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీలకు నిరంతరం అనేక సేవలందించడమే లక్ష్యంగా దశాబ్ధాల కాలం నుంచి తమ సొసైటీ పని చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










