ఆనందపురం మండల సభలో పలువురి సర్పంచ్‌ల ఆవేదన
ప్రజాశక్తి -ఆనందపురం : నిధుల లేమితో గ్రామాల్లో సమస్యలను పరిష్కరించలేక, సౌకర్యాల కల్పించలేని దుస్థితిలో ప్రజలకు ముఖాలను చూపించలేకపోతున్నామని మామిడిలోవ సర్పంచ్ బలిరెడ్డి మల్లికార్జునరావు(చంటి) ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఎంపిపి మజ్జి శారద ప్రియాంక అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశంలో ముఖ్యఅతిథి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతుండగా, అడ్డుతగిలి పలు సమస్యలపై నిలదీసి, తన ఆక్రోషాన్ని వెల్లగక్కారు. దీనికి ఎమ్మెల్యే ముత్తంశెట్టి స్పందిస్తూ, మండల సమావేశాన్ని రాజకీయం చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల సమావేశంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి మాట్లాడుతుండగా, అడ్డుతగిలిన మామిడిలోవ సర్పంచ్ బలిరెడ్డి మల్లికార్జునరావు మాట్లాడుతూ, గడచిన నాలుగేళ్లలో గ్రామాల్లో ఒక్కపనైనా చేయలేక ప్రజల ముందుకు వెళ్లాలంటే సిగ్గేస్తుందన్నారు. జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించినప్పటికీ నేటికీ పూర్తికాలేదని, రోడ్లు అధ్వానస్థితిలో ఉన్నా పట్టించుకునే దిక్కులేదని, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలెన్నుకున్న సర్పంచ్‌లకు కనీస సమాచారం ఇవ్వకుండా వైసిపి నేతలే ఇష్టానుసారంగా అన్నింటిలోనూ కలగజేసుకుని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఆరోగ్యశ్రీ వైద్యానికి వెళితే, బిల్లులు చెల్లించడం లేదంటూ కార్పొరేటు ఆసుపత్రుల్లో వైద్యం అందించక తిప్పిపంపుతున్నారని వివరించారు. దీనిపై ముత్తంశెట్టి స్పందిస్తూ, సమాధానం చెప్పలేక, సమస్యలను రాజకీయం చేయొద్దంటూ తిరిగి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరు నెలల క్రితం రూ.60లక్షలతో జలజీవన్‌మిషన్ పనులు ప్రారంభించినా, బోర్లు వేసి మిగతా పనులు పూర్తి చేయకుండా అర్థాంతరంగా వదిలేశారని ఆనందపురం సర్పంచ్ చందక లక్ష్మి విన్నవించారు. కోర్టు పరిధిలో ఉన్న 459మంది లబ్ధిదారుల జగనన్న ఇళ్ల సమస్యను పరిష్కరించాలని జెడ్‌పిటిసి కోరాడ వెంకటరావు కోరారు. 80 మంది లబ్ధిదారులకు జగనన్న ఇళ్లు బిల్లులు రాలేదని, వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పాలవలస సర్పంచ్ నాగోతు నరసమ్మ కోరారు. గంభీరం రిజర్వాయర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటుతోపాటు రక్షణ చర్యలు చేపట్టి అభివృద్ధి చేయాలని వైస్ ఎంపిపి బొట్ట ధనలక్ష్మి రామకృష్ణ కోరారు. వీధి కుక్కల బెడద నివారించాలని జెడ్‌పిటిసి కోరాడ వెంకటరావు సూచించారు. కెజిబివిలో ఆరోతరగతిలో ప్రస్తుతమున్న 40సీట్లను పెంచాలని కస్తూర్బా విద్యాలయం పత్యేకాధికారి చంద్రకళ కోరారు. అధ్వానంగా ఉన్న బాలికల హాస్టల్ రోడ్డు బాగుచేయాలని వార్డెన్ విన్నవించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ లవరాజు, తహశీల్దార్ లోకవరపు రామారావు, వైస్ ఎంపిపిలు పాండ్రంకి శ్రీను, బొట్ట ధనలక్ష్మి రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలమంచిలి సూర్యనారాయణ, వైస్‌చైర్మన్ బోనీ అప్పలనాయుడు, పార్టీ ప్రెసిడెంట్ బంక సత్యనారాయణ, సర్పంచులు గనిరెడ్డి శ్రీనివాసరావు, బలిరెడ్డి మల్లికార్జునరావు, బిఆర్‌బి నాయుడు, చందక లక్ష్మి, లోడగల రమణ పాల్గొన్నారు










