Apr 12,2023 23:52

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి, మేయర్‌

ప్రజాశక్తి- అనకాపల్లి
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. 84వ వార్డు పరిధిలోని కోట్ని వీధిలో నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌, జీవీఎంసీ సంయుక్తంగా కోటి పది లక్షల రూపాయలతో నిర్మించిన వైయస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని బుధవారం మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం వార్డు ఇన్చార్జ్‌ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా పట్టణంలో 7 సచివాలయాల పరిధిలో 20వేల మంది జనాభాకు వైద్య సేవలు అందిస్తామన్నారు. 66 రకాల వైద్య పరీక్షలతో పాటు 101 రకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
స్వీపింగ్‌ మిషన్‌ ప్రారంభం
అనకాపల్లి జోన్‌కు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.95 లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్‌ మిషన్‌ను మంత్రి అమర్నాథ్‌, మేయర్‌ హరి వెంకట కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రహదారులను శుభ్రపరిచేందుకు ఈ యంత్రం ఎంతో ఉపకరిస్తుందన్నారు. నగర సుందరీకరణలో భాగంగా పార్కుల అభివద్ధి, పారిశుధ్యం మెరుగుదల, మొక్కల పెంపకం, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్న లక్ష్మి, డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ హేమంత్‌, జోనల్‌ కమిషనర్‌ వెంకటరమణ, జిల్లా ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ రామ్మూర్తి, రత్న కుమారి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పలక యశోద, వైసిపి నాయకులు దంతులూరి దిలీప్‌ కుమార్‌, మందపాటి జానకి రామరాజు, పలక రవి, జాజుల రమేష్‌, కొణతాల మురళీకృష్ణ పాల్గొన్నారు.