
ప్రజాశక్తి కదిరి అర్బన్ : ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్థానిక ఎమ్మెల్యే పివి. సిద్ధారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్‌లో మున్సిపల్ అధికారులతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పనులపై మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఇది వరకే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 27 సచివాలయాలకు ప్రతి సచివాలయానికి కూడా రూ.20 లక్షల రూపాయలు విడుదలయ్యాయన్నారు. రూ. 5.40 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో పనులను ఇదివరకే చేపట్టామన్నారు. కొన్ని సచివాలయ పరిధిలో పనులు కూడా పూర్తి చేశామని తెలిపారు. పనులు పూర్తి అయిన వాటి బిల్లులను అప్లోడ్ చేయడం పూర్తి చేయాలన్నారు. వార్డులలో పనులు ప్రారంభం కానిచోట త్వరగా ప్రారంభింపజేయాలన్నారు. బిల్లులు అప్లోడ్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని పంచాయతీరాజ్ వారితో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్‌తో పాటు మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.