May 12,2023 23:17

గాలి, వాన బాధిత గ్రామాల్లో ఎంఎల్‌ఎ వాసుబాబు పర్యటన
ప్రజాశక్తి - భీమడోలు

                  మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న గాలి, వాన వల్ల నష్టపోయిన గ్రామాల్లో ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు శుక్రవారం సాయంత్రం పర్యటించారు. పూళ్ల, దుద్దేపూడి, కోడూరుపాడు గ్రామాల్లో పర్యటించిన ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసిపి ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పూళ్ల పంచాయతీ పాలకవర్గం రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద ఏర్పాటుచేసిన జనరేటర్‌లను పరిశీలించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను తిలకించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు చేశారు. ట్రాన్స్‌కో భీమడోలు భీమడోలు ఎడిఎ గోపాలకృష్ణను విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భీమడోలు ఎంపిపి కె.రామయ్య, సర్పంచి దాయం సుజాత, భీమడోలు సొసైటీ అధ్యక్షుడు రాయపాటి సత్యశ్రీనివాస్‌ పాల్గొన్నారు.
తహశీల్దార్‌ పర్యటన
మండల పరిధిలో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు నష్టపోయిన పూళ్ల, కురెళ్లగూడెం, దుద్దేపూడి, కోడూరుపాడు గ్రామాల్లో తహశీల్దార్‌ షంషుద్దీన్‌ ఆధ్వర్యంలోని అధికారుల బృందం శుక్రవారం పర్యటించింది. జరిగిన నష్టాలను అంచనా వేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు స్థానిక యంత్రాంగానికి ఆదేశాల జారీ చేశారు. ట్రాన్స్‌ కో భీమడోలు ఎడిఎ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది విద్యుత్‌ లైన్ల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన దుద్దేపూడి, కోడూరుపాడు, పూళ్ల గ్రామాల్లో ఉన్న నాలుగు రక్షిత మంచినీటి పథకాల వద్ద తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక జనరేటర్లను ఏర్పాటు చేశారు. పూళ్ల గ్రామపంచాయతీ కార్యదర్శి సూర్యకుమార్‌, సర్పంచి దాయం సుజాతప్రసాద్‌ ఆధ్వర్యంలో పూళ్ల-ఎంఎం.పురం రహదారిపై ఉన్న అడ్డంకులను తొలగించి, రాకపోకలకు ఇబ్బంది లేని విధంగా సిద్ధం చేశారు. ఈదురుగాలుల వల్ల నాగేశ్వరపురంలో నష్టం వాటిల్లిన ఐదు గృహాలకు ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు భీమడోలు ఎంపిడిఒ డి.సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఇదేవిధంగా ఈదురు గాలులకు నేల వాలిన 70 విద్యుత్‌ స్తంభాల స్థానంలో నూతన స్తంభాల ఏర్పాటు, కండక్టర్లు ఏర్పాటు చేయడం, ట్రాన్స్‌ఫారంలను బాగు చేయటం వంటి కార్యక్రమాలను ట్రాన్స్‌ కో ఎడిఇ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రస్తుతం కురెళ్లగూడెంలో తమ శాఖ చేపట్టిన పనులు పూర్తయ్యాయని ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ భీమడోలు ఎఇ కె రామారావు పాల్గొన్నారు.