Oct 28,2023 21:14

పైడితల్లమ్మ ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : పైడితల్లమ్మ పండగకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ముఖ్యంగా ఇతర, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు అసౌకర్యం లేకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ప్రముఖులను సోమవారమే దర్శనాలు పూర్తిచేసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. తాను కూడా సోమవారమే దర్శనం చేసుకుంటానన్నారు. పైడితల్లమ్మ పండగ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల శనివారం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రెవెన్యూ, దేవాదాయ, పోలీసు అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. సాధారణ భక్తుల దర్శనాలకు వీలుగా మంగళవారం ప్రముఖుల తాకిడి లేకుండా చూసేందుకే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయంలోకి క్యూలైన్ల ద్వారా ప్రవేశం, దర్శనానంతరం తిరిగి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించే ద్వారం వద్ద ఏర్పాట్లు, ఈ మార్గంలో ప్రవేశాలు నియంత్రించేందుకు చేస్తున్న ఏర్పాట్లపై ఆలయ అధికారులకు సూచనలు చేశారు. ఈ పర్యటనలో పైడితల్లమ్మ ఆలయ ఇఒ సుధారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీరాములు నాయుడు, ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, డిఎస్‌పి గోవిందరావు, ట్రాఫిక్‌ డిఎస్‌పి విశ్వనాథ్‌, తహశీల్దార్‌ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.